అమరావతికి మద్దతుగా కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. మందడం, వెలగపూడి, బోరుపాలెం, తుళ్లూరు, పెదపరిమి, అబ్బురాజుపాలెం, రాయపూడి దీక్షా శిబిరాల్లో రైతులు నిరసనలు తెలిపారు. అనంతవరంలో మహిళలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. నీరుకొండలో గాంధీ విగ్రహం వద్ద నినదించారు.
‘అమరావతి వెలుగు’లో భాగంగా రైతులు, మహిళలు విద్యుద్దీపాలను ఆర్పేసి ఇళ్ల ముందు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. సేవ్ అమరావతి పేరుతో ముగ్గులు వేశారు. 3రాజధానుల వల్ల తమకు జరిగే అన్యాయాన్ని వివరిస్తూ వీడియో సందేశాలను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, న్యాయపోరాటం కొనసాగుతుందని అమరావతి ఐకాస ప్రకటించింది. అన్ని గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో నిరసనలు కొనసాగించాలని కోరింది.
రాష్ట్రవ్యాప్తంగా 103 నియోజకవర్గ కేంద్రాలు, 320 మండలకేంద్రాల్లో తమ శ్రేణులు నిరసనలో పాల్గొన్నాయని తెదేపా వర్గాలు తెలిపాయి. గుంటూరు జిల్లా తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్, నరసరావుపేటలో తెదేపా బాధ్యుడు అరవిందబాబుల నేతృత్వంలో నిరసనలు చేపట్టారు. గుంటూరు తూర్పు, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, చిలకలూరిపేట, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఉద్యమించారు. సత్తెనపల్లిలో న్యాయదేవత విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అప్పికట్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వినుకొండలో తెదేపా, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కొనసాగింది. కృష్ణా జిల్లా నందిగామలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఆధ్వర్యంలో ఆందోళన సాగింది. వారు మందడం శిబిరాన్ని సందర్శించారు. గన్నవరం, మైలవరం, వీరులపాడులోనూ నిరసనలు చేపట్టారు. నెల్లూరు జిల్లా కోవూరు, కలిగిరి, బుచ్చిరెడ్డిపాలెం, గూడూరుల్లో పార్టీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించారు.