వచ్చే నెల నుంచి అమరావతి ఉద్యమాన్ని నలుదిశలా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాజధాని పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. అమరావతిని సాధించుకునేందుకు న్యాయపోరాటంతో పాటు ప్రజల మద్దతు కోసం 13 జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పారు.
పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు 283వ రోజు ఆందోళన కొనసాగించారు. వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నీరుకొండ, మందడం, వెలగపూడి, రాయపూడి, అబ్బరాజుపాలెం గ్రామాల్లో దీక్షా శిబిరాల వద్ద అన్నదాతలు ఆందోళన చేశారు. బోరుపాలెంలో మహిళలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అమరావతికి మద్దతు ప్రకటించిన ఎంపీ రఘురామకృష్ణరాజు చిత్రపటానికి ఐనవోలులో పాలాభిషేకం చేశారు.