అమరావతిలో రైతులు, మహిళల ఆందోళనలు 429వ రోజుకు చేరుకున్నాయి. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని రైతులు, మహిళలు దీక్షా శిబిరాల్లో నిరాహార దీక్ష చేపట్టారు. తుళ్లూరు, పెదపరిమి, ఉద్ధండరాయునిపాలెంలో మహిళలు నిరాహార దీక్షలు కొనసాగించారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా కృష్ణాయపాలెం, తుళ్లూరులో మహిళలు నిరసన చేపట్టారు. గోరుతో తలంబ్రాల బియ్యాన్ని ఒలిచారు. మార్చి 11న జరిగే శివకల్యాణంలో ఈ తలంబ్రాలను వినియోగించి.. అమరావతే రాజధానిగా కొనసాగించాలని మొక్కులు చెల్లిస్తామని మహిళలు తెలిపారు.