రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోవటం, రాజధాని వేరే చోటుకు మారుస్తారనే ఊహాగానాలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో.. రాజధాని రైతులు గుంటూరు జిల్లా తుళ్లూరులోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం సమావేశమయ్యారు. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల నుంచి... అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూములు, స్థలాలు ఇచ్చి అమరావతిలో ప్లాట్లు పొందిన వారు సమావేశానికి వచ్చారు.
ఒప్పందాన్ని అమలుచేయాల్సిందే..!
రాజకీయ విమర్శలకు తావు లేకుండా కేవలం భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వంతో సంప్రదింపులు, న్యాయపోరాటం వంటి అంశాలపై రైతులు చర్చించారు. మంత్రుల ప్రకటనలు కొంత ఆందోళనకు గురి చేస్తున్నట్లు రైతులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి నిధుల సమస్య ఉంటే... విభిన్నమైన మార్గాల్లో సమీకరించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని రైతులు సూచించారు. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలపై సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే రాజధాని కోసం భూములను త్యాగం చేశామని... గత ప్రభుత్వంతో ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి చట్టపరమైన ఒప్పందాలు చేసుకున్నామని రైతులు గుర్తుచేసుకున్నారు. 9.14 ఒప్పందం ప్రకారం రైతులకు ఎక్కడా నష్టం జరిగే అవకాశం లేదని... ఒప్పందంలోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం అమలు చేసి తీరాల్సిందేనని సుధాకర్ అనే రైతు స్పష్టం చేశారు.
రాజధానిపై స్పష్టతేదీ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే కొంచెం ఆలస్యం కావొచ్చు గాని... రాజధానిలో అభివృద్ధి మాత్రం జరగాల్సిందేనన్నారు. ప్రస్తుతం రాజధానిలో ఉన్న భూముల్లో సగం భూముల్ని ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తే... అమరావతికి కావాల్సిన నిధులు వస్తాయని... లేక సీఆర్డీఏ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని అభివృద్ధి చేయవచ్చని సూచించారు. రాజధానిపై అన్ని పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాయని స్వరాజ్యరావు అనే రైతు గుర్తు చేశారు. రైతులంతా భూములిచ్చింది రాజధాని కోసమేనని... కాబట్టి ఇక్కడ అమరావతి నిర్మాణ జరిగితీరాల్సిందేనని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఆర్డీఏపై జరిగే చర్చలో అమరావతిపై తేల్చాలని నర్శింహరావు అనే రైతు డిమాండ్ చేశారు. అమరావతిని మరోచోటికి తరలించటం సాధ్యం కాదన్నారు. రాజధానికి 5వేల కోట్లు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఆ నిధులు తెచ్చేందుకు ప్రయత్నించాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు.