Amaravati farmers to Delhi: రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. వెయ్యి రోజులుగా పోరాటం చేస్తున్న రైతులు తమ గళాన్ని దిల్లీలో గట్టిగా వినిపించేందుకు పయనమయ్యారు. రాజధాని గ్రామాల్లో రిలే దీక్షలు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర, అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర వంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించిన రైతులు.. ఇప్పుడు జాతీయస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లాలనే లక్ష్యంతో హస్తిన బాట పట్టారు. విజయవాడ నుంచి గురువారం మధ్యాహ్నం ప్రత్యేక రైలులో దిల్లీకి బయల్దేరారు. రాజధాని గ్రామాలకు చెందిన సుమారు 15 వందల మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు, ఐకాస నేతలు దిల్లీ వెళ్లారు. శుక్రవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు.. ఈ ప్రత్యేక రైలు దిల్లీ చేరుకోనుంది.
సీఎం జగన్.. మూడు రాజధానుల ప్రకటన చేసి ఈనెల 17వ తేదీకి మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో.. అమరావతి రైతులు ఈ దిల్లీ యాత్ర చేపట్టారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ.. అన్ని పార్టీల ఎంపీలు, జాతీయ పార్టీల అధినేతలను కలిసి అమరావతి ఆవశ్యకతతో పాటు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని రైతులు తెలిపారు.