అమరావతి అన్నదాతలు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం 500 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి ఐకాస ఆధ్వర్యంలో అమరావతి ఉద్యమ భేరి పేరిట వర్చువల్ విధానంలో సభ నిర్వహించారు. ఉద్యమం 500వ రోజుకు చేరిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రాయపూడి దీక్ష శిబిరంలో దళిత చైతన్య గీతం సీడీని.. అమరావతి ఐకాస నేతలు, ఎస్సీ ఐకాస నేతలు విడుదల చేశారు. ఉద్ధండరాయినిపాలెం దీక్షా శిబిరంలో బుద్ధిని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐకాస నేతలు, అన్నదాతలు, మహిళలు పాల్గొన్నారు.
'రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. నమ్మకంతో భూములిస్తే అవమానపరుస్తారా?ఏకైక రాజధానిగా అమరావతి తథ్యం. అమరావతికి జరిగిన అన్యాయం తట్టుకోలేక ఎంతోమంది రైతుల గుండెలాగాయి. అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిఒక్కరికీ శిరస్సు వంచి వందనాలు. అమరావతి ఉద్యమం అజరామరం, త్వరలోనే మంచిరోజులు. రానున్న రోజుల్లో పరిణామాలు మారుతాయి. అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుంది'- జీవీఆర్ శాస్త్రి, అమరావతి ఐకాస గౌరవ అధ్యక్షుడు