రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి 400వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి రైతులు రాజధాని గ్రామాల్లో చేపట్టిన అమరావతి సంకల్ప ర్యాలీ ఘనంగా ముగిసింది. తుళ్లూరులో ఉదయం ప్రారంభమైన ర్యాలీ రాజధాని పరిధిలోని పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్లమాను, హరిశ్చంద్రపురం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం మీదుగా మందడం వరకు సాగింది.
తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, సీపీఐ రామకృష్ణ ఇతర నేతలు ఈ ర్యాలీలో పాల్గొని రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. అమరావతి నుంచి రాజధాని తొలగించాలనే కుట్రతో ప్రభుత్వం ఇప్పటివరకూ ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసిందని... వాటన్నింటినీ అధిగమించి రాజధాని కోసం పోరాడుతున్నట్లు రైతులు తెలిపారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రభుత్వం నిన్నటివరకూ చెప్పిన మాటలు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అసత్యమని తేలిందని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అన్నారు. హైకోర్టును ఇక్కడ నుంచి కర్నూలుకు తరలించాలని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను వారు తప్పుపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.