గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంకు చెందిన ఏడుగురు రైతులు గురువారం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన మేరకు.. రైతులను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. బెయిల్ కాగితాలు జైలు అధికారులకు అందజేసినా... రైతులను విడుదల చేసేందుకు 4 గంటల సమయం తీసుకున్నారు. అనంతరం కుక్కమళ్ల అమర్, నంబూరు రామారావు, ఈపూరి సందీప్, ఈపూరి రవికాంత్, ఈపూరి కిషోర్, సొంఠి నరేష్, దానబోయిన బాజీ.. కారాగారం నుంచి విడుదలయ్యారు. అమరావతి ఐకాసతో పాటు తెదేపా, సీపీఐ నేతలు రైతులకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఎస్సీలపైనే అట్రాసిటి కేసులు పెట్టిన పోలీసుల వైఖరిని రైతులు ఖండించారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరని ఐకాస నేతలు, రాజధాని రైతులు స్పష్టం చేశారు.
'ఐపీసీ బదులు వైసీపీ సెక్షన్లు అమలు'
దళితులకు అంబేడ్కర్ కల్పించిన హక్కులను ఖననం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు. రైతులు ఏం తప్పు చేశారని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపారని ప్రశ్నించారు. గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లకు బదులు వైసీపీ సెక్షన్లు మాత్రమే అమలవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే రైతులపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. రైతులకు బేడీలు వేయడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు.