రాజధాని రైతులు, మహిళల మహాపాదయాత్ర నాలుగో రోజు ఉద్ధృతంగా సాగింది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట నుంచి ఇవాళ్టి పాదయాత్ర ప్రారంభంకాగా..స్థానికులు పూల వర్షం కురిపించి సాదరంగా ఆహ్వానించారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ పలు పార్టీల నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.
అమరావతి పరిరక్షణ కోసం రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్రకు స్థానికుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. పుల్లడిగుంటలో మంగళ హారతులు పట్టి..రైతులు, మహిళలపై పూల వర్షం కురిపించి సంఘీభావం తెలిపారు. వేలాది మంది పాదయాత్రలో పాల్గొని జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. సికింద్రాబాద్ నుంచి కూడా రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు. కులమతాలకు అతీతంగా సాగుతున్న ఈ పాదయాత్రకు రాష్ట్రంలోని ప్రజలందరూ మద్ధతు పలకాలని రైతులు కోరారు. దీపావళి పర్వదినాన ఇళ్ల వద్ద పండుగ వాతావరణం ఉండేదని ప్రస్తుతం పాదయాత్ర మూలంగా పండగకి దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని కాపాడుకున్న రోజే నిజమైన దీపావళి పండగని రైతులు అభిప్రాయపడ్డారు.
4వ రోజు పాదయాత్రలో వివిధ పార్టీలకు చెందిన నేతలు మహా పాదయాత్రలో పాల్గొన్నారు. తెలుగుదేశం తరపున కొనకళ్ల నారాయణ, యరపతినేని శ్రీనివాసరావు, శ్రావణ్ కుమార్, బొండా ఉమ, భాజపా తరపున రావెల కిషోర్ బాబు, సీపీఐ తరపున ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతులతో పాటు తాము సైతం అంటూ ఈ మహా పాదయాత్రలో పాదం కలిపారు. ఆనాడు రాజధానిగా అమరావతిని అంగీకరించి.. తీరా ప్రభుత్వం వచ్చాక మడమ తిప్పడం, మాట తప్పడం భావ్యం కాదని వివిధ పక్షాల నేతలు ధ్వజమెత్తారు.
ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం దగ్గర నాలుగోరోజు పాదయాత్ర ముగించిన రైతులు.. శుక్రవారం అక్కడి నుంచే తిరిగి ప్రారంభించనున్నారు.