ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Amaravathi Assigned Lands Case: 'సదుద్దేశంతోనే జీవో 41 జారీ'.. అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణ నేటికి వాయిదా..

HC on Ex Minister Narayana CID Case: రాజధాని నిర్మాణ నిర్ణయాలపై అధికారులకు రక్షణ ఉందని.. చంద్రబాబు తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. అసైన్డ్‌ భూముల విషయంలో సదుద్దేశంతోనే జీవో 41 జారీ చేశారని తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతివ్వాలని సీఐడీ తరఫున అదనపు ఏజీ కోరారు. ఈ కేసు విచారణను హైకోర్టు నేటికి వాయిదా వేసింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 3, 2023, 8:36 AM IST

HC on Ex Minister Narayana CID Case: రాజధాని నగరం నిర్మాణం వ్యవహారంలో తీసుకున్న నిర్ణయాలపై సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 146.. ప్రభుత్వం, అధికారులకు ప్రాసిక్యూషన్‌ నుంచి రక్షణ కల్పిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. నిర్ణయాలు తీసుకున్న వారిపై దావాలు, కేసులు నమోదు చేయడానికి వీల్లేదన్నారు. ఎసైన్డ్‌ భూముల విషయంలో జారీచేసిన జీవో41 సదుద్దేశంతో ఇచ్చిందేనన్నారు. జీవో జారీకి దురుద్దేశాలు ఆపాదించడానికి వీల్లేదన్నారు. పిటిషనర్లపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అదనపు ఏజీ పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

రాజధాని పరిధిలో అసైన్డ్‌ భూముల సేకరణపై సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టేయాలంటూ.. చంద్రబాబు, నారాయణ వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. రాజధాని నగర నిర్మాణం వ్యవహారంలో తీసుకున్న నిర్ణయాలపై.. సీ.ఆర్.డీ.ఏ చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం.. ప్రభుత్వం, అధికారులకు ప్రాసిక్యూషన్‌ నుంచి రక్షణ ఉంటుందన్నారు. నిర్ణయాలు తీసుకున్న వారిపై దావాలు, కేసులు నమోదు చేయడానికి వీల్లేదన్నారు.

అసైన్డ్‌ భూముల విషయంలో సదుద్దేశంతోనే గత ప్రభుత్వం జీవో 41 జారీ చేసిందని వివరించారు. పిటిషనర్లపై సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల జరిగిన విచారణలో చంద్రబాబు తరఫు న్యాయవాది సుధీర్ఘ వాదనలు వినిపించారు. దానికి కొనసాగింపుగా బుధవారం కొద్దిసేపు వాదనలు వినిపించారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతివ్వాలని.. సీఐడీ తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు.

బినామీలు, బంధువుల ద్వారా అప్పటి మంత్రి నారాయణ 18 కోట్ల రూపాయలు వెచ్చించి 148 ఎకరాల అసైన్డ్, అటవీ భూములను కొనుగోలు చేశారని హైకోర్టుకు తెలిపారు. నారాయణతో పాటు తెలుగుదేశం నేతల అనుచరులు అసైన్డ్‌ రైతులను బెదిరించి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారని అన్నారు. వారికి ప్రయోజనం కల్పించడం కోసమే జీవో 41 తీసుకొచ్చారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అప్పటి కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, సంయుక్త కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఆ జీవోను వ్యతిరేకించారని తెలిపారు. నారాయణ ఫోన్‌లో చేసిన సూచన మేరకు జీవో ఇచ్చినట్లు పురపాలక శాఖ అప్పటి కార్యదర్శి అజయ్‌జైన్‌ పేర్కొన్నారని చెప్పారు. ఈ మేరకు అధికారులు వాంగ్మూలాలు ఇచ్చినట్లు కోర్టుకు నివేదించారు.

అసైన్డ్‌ భూముల బదిలీ నిర్ణయానికి న్యాయశాఖ, అప్పటి ఏజీ అనుమతి లేదన్నారు. అదనపు ఏజీ వాదనలపై స్పందించిన పిటిషనర్‌ తరఫు సీనియర్ న్యాయవాది.. ఈ కేసుతో సంబంధం లేని విషయాలను చెబుతున్నారని హైకోర్టుకు తెలిపారు. ఆ వాంగ్మూలాలు ఏ కేసుకు సంబంధించినవో కూడా అదనపు ఏజీ చెప్పలేకపోతున్నారని వివరించారు. ప్రస్తుత కేసులో దర్యాప్తును హైకోర్టు గతంలో నిలుపుదల చేసిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు దర్యాప్తు కొనసాగించి వాంగ్మూలాలు సేకరించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అదనపు ఏజీ వాదనల కొనసాగింపునకు వీలుగా విచారణను హైకోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details