కరోనా మరణాలపై ప్రభుత్వం వాస్తవ లెక్కలు చెప్పాలని.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో.. తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, పట్టాభిరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన తరఫున బోనబోయిన శ్రీనివాసయాదవ్, కాంగ్రెస్ తరపున లింగంశెట్టి ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
కరోనా నియంత్రణలో.. రాష్ట్ర ప్రభత్వం విఫలమైందని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. కరోనా బాధిత కుటుంబాలకు.. నెలకు రూ.7500 చొప్పున భృతి ఇవ్వాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. వచ్చే సోమవారం కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు. వాస్తవంగా కరోనాతో ఎంతమంది చనిపోయారనేది అఖిలపక్ష పార్టీల తరపున సర్వే నిర్వహిస్తామన్నారు. కరోనాతో మరణించిన మృతుల కుటుంబాలు ఎక్కడైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని.. 8144226661 ఫోన్ నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే వారి పేర్లు నమోదు చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.