Agri Testing Labs Service in AP: రైతులకు ఏదో ఒరగబెడుతున్నామంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చెప్పిన మాటలు.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించేందుకు నియోజకవర్గానికి ఒక ల్యాబరేటరీ నిర్మిస్తామని వీటిల్లో పరీక్షించి నిర్థరించిన తర్వాత నాణ్యమైన వాటినే గ్రామస్థాయికి తెచ్చి విక్రయిస్తామన్న హామీలు మాటలకే పరిమితమయ్యాయి.
Farmers Problems: అన్నదాతకు భరోసా ఇవ్వని పంటల బీమా.. ఆవేదనలో రైతన్న
సీఎం ప్రకటన చేసి నాలుగేళ్లు గడిచిపోయింది. భవనాల నిర్మాణం తప్ప.. ల్యాబరేటరీలు రైతులకు అందుబాటులోకి రాలేదు. కనీసం ల్యాబ్‌లో సిబ్బందిని నియమించలేదు. రైతులు ఎవరైనా సరే నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌కు వెళ్లి విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించుకోవచ్చన్న జగన్ మాటలేవీ అమలుకు నోచుకోవడం లేదు. ల్యాబరేటరీలు అందుబాటులో లేక రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులతో నష్టపోతూనే ఉన్నారు. మొక్కుబడి తనిఖీలు, పైపై చర్యలతో వైసీపీ ప్రభుత్వం మమా అనిపోస్తోంది.
సుబాబుల్, జామాయిల్ రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం..
రాష్ట్రవ్యాప్తంగా 127 చోట్ల ఒక్కొక్కటీ కోటి రూపాయల వ్యయంతో ల్యాబరేటరీలునిర్మించారు. కానీ వాటిల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతులు తీసుకెళ్లిన ఉత్పత్తులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదు. పైగా అక్కడ పనిచేసే సిబ్బంది లేరు. అరకొరగా నియమించిన సిబ్బందికి ఇప్పుడిప్పుడే శిక్షణ ఇస్తున్నారు. అయితే RBKల స్థాయిలో రైతుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. అవి కేవలం పేపర్ లెక్కలకే పరిమితమవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 10వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఉండగా.. సగటున ఒక్క నమూనా కూడా ఇప్పటి వరకు లేదు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చెప్పిన ప్రకారం నియోజవర్గ ల్యాబ్‌లో విత్తన, ఎరువుల నాణ్యత పరీక్షలు చేయాలి. పురుగు మందుల నమూనాలను జిల్లాస్థాయి వ్యవసాయ ప్రయోగశాలకు పంపించాలి. విత్తనాల్లో తేమ, మొలకశాతం, బాహ్య స్వచ్ఛత పరీక్షలు, ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ నాణ్యతను పరీక్షించాల్సి ఉంటుంది.
Tenant farmers Problems: సమస్యలన్నీ పరిష్కరిస్తానన్న జగన్.. మాపై చిన్నచూపు ఎందుకంటున్న కౌలురైతులు
మొత్తం విత్తన లాట్లలో 20 శాతం, పురుగుమందుల లాట్లలో 10శాతం, ఎరువులకు సంబంధించి 100శాతం పరీక్షలు నిర్వహించాలి. నియోజకవర్గ ల్యాబ్‌ల్లో రైతులకు ఇచ్చిన నమూనాలను ఉచితంగా పరీక్షించి..ఫలితాలను వెంటనే తెలియజేయాలి. నాణ్యతలో తేడా ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారి చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఎక్కడా అమలు జరగడం లేదు.
నియోజకవర్గానికో ల్యాబ్, ప్రాంతీయస్థాయిలో 4 కోడింగ్ ల్యాబ్‌లు, జిల్లాస్థాయిలో 13 ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని 2019లో ప్రతిపాదించారు. అదే ఏడాది డిసెంబర్ 11న విధివిధానాలు జారీచేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం నాబార్డు 213 కోట్ల రుణం ఇచ్చింది. 147 నియోజకవర్గస్థాయి ల్యాబ్‌ల ఏర్పాటుకు తొలుత రూ.109 కోట్లతో అంచనాలు రూపొందించారు. అది కాస్తా పెరుగుతూ ఒక్కో ల్యాబ్‌కు కోటిరూపాయల వ్యయం అయ్యింది.
అయినప్పటికీ పూర్తిస్థాయిలో నిర్మాణాలు కాలేదు. ఇప్పటి వరకు 127 భవనాలు మాత్రమే పూర్తి చేశారు తప్ప.. వీటివల్ల రైతులు ఒనగూరిన ప్రయోజనం ఏమీలేదు. రైతులు.. విత్తనాలు, ఎరువులను తీసుకెళ్లినా పరీక్షించడం లేదు. గతంలో మాదిరిగానే వ్యవసాయ అధికారులు దుకాణాల నుంచి నమూనాలు తీసుకుని పరీక్షలు చేస్తున్నారు. ఒకవేళ రైతు ఎవరైనా కోరితే.. సంబంధిత దుకాణం నుంచి నమూనా తీసుకుని పరీక్షలకు పంపిస్తున్నారు. వాటి ఫలితాలు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి. సమగ్ర వ్యవసాయ పరీక్ష కేంద్రాల్లో సరిపడినంత సిబ్బంది లేరు. సుమారు 150 ఖాళీలు ఉన్నాయి. అసలు సిబ్బందే లేకపోతే పరీక్షలు ఎలా చేస్తారో ప్రభుత్వమే చెప్పాలని రైతులు కోరుతున్నారు.