Agitations on CBN Arrest:తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. యువత భవితకు భరోసానిచ్చిన నైపుణ్యాభివృద్ధి సంస్థలో అక్రమాలు జరిగాయంటూ అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసనలను కొనసాగించాయి.
చంద్రబాబును విడుదల చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని టీఎన్ఎస్ఎఫ్ నేతలు స్పష్టం చేశారు. అనంతపురంలో చేపట్టిన దీక్షలో పెద్దఎత్తున టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలు జలదీక్ష చేపట్టారు. అనంతరం మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి 101 టెంకాయలు కొట్టారు. గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
జగన్ సమాధానం చెప్పు.. నీకో రూలు.. నాకో రూలా..?: చంద్రబాబు
కర్నూలు జిల్లా మంత్రాలయంలో దీక్షా శిబిరానికి బసవన్నను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నంద్యాలలో దీక్షా శిబిరాన్ని యాదవ సంఘ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా నుంచి వెళ్లి రష్యాలో స్థిరపడిన తెలుగు ప్రజలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. పీటర్స్‌బర్గ్‌లో నిరసన తెలిపారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో గత 24 రోజులుగా కొనసాగుతున్న దీక్షల్లో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు. మోపిదేవి మండలానికి చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నాగాయలంకలో సంతకాల సేకరణ చేపట్టారు. 2024లో నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని టీడీపీ శ్రేణులు ఆకాంక్షించారు. ఆయనపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.