ADVOCATES PROTEST AT HIGHCOURT : హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ . రమేశ్ అకస్మిక బదిలీలను నిరసిస్తూ.. న్యాయవాదులంతా విధులు బహిష్కరించారు. నెక్ బ్యాండ్లను తొలగించి కోర్టు ప్రాంగణంలో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే ప్రజా న్యాయమూర్తులుగా ముద్రపడిన జడ్జీల బదిలీ జరిగిందని మండిపడ్డారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిష్పక్షపాతంగా తీర్పులిస్తున్నందునే బదిలీ చేయించారని ఆక్షేపించారు. పేద, అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని భరోసా కల్పించిన జడ్డీల ఏకపక్ష బదిలీలపై అనుమానాలు వ్యక్తం చేసిన న్యాయవాదులు.. కక్షసాధింపు చర్యల్లో భాగంగా చేసిన ఫిర్యాదుకు అనవసర ప్రాముఖ్యత ఇస్తే మిగిలిన న్యాయమూర్తుల పనివిధానంపై ఆ ప్రభావం పడుతుందన్నారు.
అటెండరైనా, ఐఏఎస్ అధికారైనా కోర్టు దృష్టిలో సమానమనేలా ఇరువురు న్యాయమూర్తులు వ్యవహరించారని గుర్తుచేశారు. జడ్జీలకు ఇబ్బంది తలెత్తితే బయటకొచ్చి మాట్లాడలేరని.. అందుకే వారి పక్షాన న్యాయవాదులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్‌లో న్యాయవాదులంతా ఒక్కమాటపై నిలబడి అక్కడి న్యాయమూర్తి బదిలీని నిలిపేయించుకున్నారని.. అదే తరహాలో ఏకతాటిపై నిలబడి బదిలీలను ఆపించుకోవాలని సీనియర్ లాయర్లు పిలుపునిచ్చారు.