ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలి' - న్యాయవాది నర్రా శ్రీనివాస్ వార్తలు

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం... న్యాయవ్యవస్థ పారదర్శకతకు నిదర్శనమని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవడం మంచిది కాదన్న అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలతోనైనా... రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలని ప్రముఖ న్యాయవాది నర్రా శ్రీనివాస్ సూచించారు.

Advocate Narra Srinivas
Advocate Narra Srinivas

By

Published : Jun 10, 2020, 4:45 PM IST

Updated : Jun 10, 2020, 7:25 PM IST

ప్రముఖ న్యాయవాది నర్రా శ్రీనివాస్​తో ముఖాముఖి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ప్రముఖ న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించినట్లు చెప్పారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలతో ఆటలు వద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్లు వివరించారు.

ఈటీవీ భారత్​:ఎన్నికల కమిషనర్ వ్యవహారానికి సంబంధించి స్టే కోసం వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ్టి విచారణలో సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
నర్రా శ్రీనివాస్ : హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీం న్యాయమూర్తులు ఆక్షేపణ వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలతో ఆటలు వద్దని చెప్పింది. పరస్పరం గౌరవించాలని సూచించింది. స్టే కోసం ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు పదేపదే కోరారు. అయితే స్టేకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేసింది. అలాగే విచారణ రెండు వారాలు వాయిదా వేసింది.

ఈటీవీ భారత్​:విచారణ సమయంలో సుప్రీం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి. స్థూలంగా వాటి అర్థం ఏమిటి?
నర్రా శ్రీనివాస్:ఆర్టికల్ 342కే లో రెండు అంశాలుంటాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం అంశం గవర్నర్ పరిధిలోనిది. ఎన్నికల కమిషనర్​కు హైకోర్టు న్యాయమూర్తి హోదా ఉంటుంది. కాబట్టి ఆయన నియమాకం, తొలగింపు రెండూ కూడా రాజ్యాంగబద్ధంగానే ఉండాలే తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదు. అందుకే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్, ఇతర జీవోలు కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవించాలని సుప్రీం ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది. ఇష్టం వచ్చినట్లు ఆర్డినెన్సులు ఎలా తెస్తారని ప్రశ్నించింది.

ఈటీవీ భారత్​:ఈ వ్యవహారంలో మిగతా పిటిషనర్లకు సంబంధించి సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
నర్రా శ్రీనివాస్: బుధవారం కేవలం నిమ్మగడ్డ పిటిషన్​పైన మాత్రమే విచారణ జరిగింది. మరో 12మంది పిటిషన్ దారులున్నారు. కాంగ్రెస్ నేత మస్తాన్ వలి తరఫున నేను కేవియట్ దాఖలు చేశాను. ఇప్పుడు మాతో పాటు 12మంది వాదనలు వినాలని కోర్టు భావించింది. అందుకే అందరికీ నోటీసులు ఇవ్వాలని చెప్పింది. అందరి వాదనలు వినకుండా స్టేపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోదు. అందుకే మా వాదనలు వినేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టు తీర్పుని గౌరవించాలి.

ఈటీవీ భారత్​: మరి ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పుపై కొత్త భాష్యం చెబుతోంది కదా?
నర్రా శ్రీనివాస్: ఇప్పుడు ఇదే సమస్య. హైకోర్టు చాలా స్పష్టంగా 330 పేజీల్లో తీర్పు వెలువరించింది. అందులో రాజ్యాంగబద్ధంగా నిమ్మగడ్డ నియామకాన్ని సమర్థించింది. ఆర్డినెన్స్ రద్దు చేయటంపైనా వివరణ ఇచ్చింది. కానీ తీర్పు తర్వాత ప్రభుత్వం కోర్టులో కాకుండా బయట మాట్లాడుతోంది. ఇలాంటి కొత్త వాదనలు కోర్టు అంగీకరించదు. కమిషనర్​కు ఇక ఏడెనిమిది నెలల పదవి కాలం మాత్రమే ఉంది. అందుకే ప్రభుత్వం అన్ని విషయాలు పరిశీలించి రమేశ్​కుమార్​ను ఆ పదవిలో కొనసాగిస్తే హుందాగా ఉంటుంది.

Last Updated : Jun 10, 2020, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details