ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాచర్లలో బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన - బందోబస్తు ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు ఎస్పీ మూర్తి

గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్లలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు పరీశీలించారు. నామినేషన్ల సందర్భంగా పలు గ్రామాల్లో తెదేపా, జనసేన మద్దతుదారులపై దాడులు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసు యంత్రాంగం గురజాల డివిజన్‌లో కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది.

Additional SP figure examining provisioning arrangements in Machars
మాచర్లలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు ఎస్పీ మూర్తి

By

Published : Feb 7, 2021, 2:11 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్లలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు గ్రామాల్లో తెదేపా, జనసేన మద్దతుదారులపై దాడులు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసు యంత్రాంగం గురజాల డివిజన్‌లో కట్టుదిట్టంగా వ్యవహరించింది. దీంతో శనివారం నుంచి డివిజన్‌లో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో రెండు, మూడు స్వల్ప సంఘటనలు మినహా తొలి రోజు నామినేషన్ల కార్యక్రమం ప్రశాంతంగా ముగియటంతో రాజకీయవర్గాలతో పాటు పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. మాచర్ల, గురజాల నియోజకవర్గాలతో ఏర్పాటైన ఈ డివిజన్‌ ఫ్యాక్షన్‌ ప్రభావిత ప్రాంతం. ఆపై జిల్లాలోనే రాజకీయంగా సున్నితమైన ప్రదేశం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య గొడవలు చోటుచేసుకుంటాయని జిల్లా యంత్రాంగం ఆందోళన చెందింది.

ఏడాది కిందట స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఇక్కడ పెద్దఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ నామినేషన్ల స్వీకరణకు ఒకరోజు ముందుగా శుక్రవారం గురజాల డివిజన్‌లో పలు సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఎన్నికల వేళ ప్రజలు సంయమనంతో ఉండాలని, ఘర్షణలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని నిర్భయంగా నామినేషన్లు వేయొచ్చని అభయమిచ్చారు.
కదిలిన తెదేపా మద్దతుదారులు..
ఎస్పీ ముందస్తుగా పర్యటించటం.. అంతకు ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ జిల్లాకు వచ్చి సమీక్ష చేసినప్పుడు పల్నాడులో గతంలో మాదిరే ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని ప్రస్తావించారు. ఈవిధానం సరికాదని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం కల్పించాలని అంతర్గత సమీక్షలు చేసిన హెచ్చరికలతో పోలీసు యంత్రాంగమే కాదు.. రెవెన్యూ, పంచాయతీరాజ్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. నామినేషన్ల కేంద్రాల్లో పోటీ చేసే అభ్యర్థులు మినహా ఇతరులను సాధ్యమైనంత వరకు రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టడంతో దుర్గి, మాచర్ల, మాచవరం, గురజాల మండలాల్లోని పలు గ్రామాల్లో తెదేపా మద్దతుదారులు నామినేషన్లు వేశారు.
తొలిరోజు స్వల్ప సంఘటనలు ఇవీ..
* దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో తెదేపా మద్దతుతో సర్పంచిగా పోటీ చేయడానికి నామినేషన్‌ వేయటానికి వెళ్లిన అంకారావును నామినేషన్‌ కేంద్రానికి సమీపంగా అడ్డగించి నామపత్రాలను ఆ గ్రామానికి చెందిన వైకాపా మద్దతుదారులు చించేశారు. ఈ విషయం ఎస్పీ దృష్టికి రావటంతో వెంటనే స్పందించిన ఆయన స్థానిక పోలీసు అధికారులను తిరిగి అతనితో నామినేషన్‌ వేయించాలని ఆదేశించారు. దీంతో ఆ వివాదంతో అంతటితో ముగిసింది. అదేమండలం ఓబులేశునిపల్లెలో నామినేషన్‌ వేయడానికి వెళ్లిన తెదేపా మద్దతుదారున్ని అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు స్పందించి అక్కడ కూడా పరిస్థితిని చక్కదిద్దారు.
* దాచేపల్లి మండలం కేశానుపల్లిలో నామినేషన్లు వేసే విషయంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పెద్దపెద్దగా కేకలు వేసుకోవటంతోనే ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టారు. ఆతర్వాత యధావిధిగానే నామినేషన్లు వేశారు.
* గురజాల మండలం అంబాపురంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఇది ఒకే పార్టీలో వార్డు అభ్యర్థిత్వం ఎవరికి కేటాయించాలి? ఎవరు నామినేషన్‌ వేయాలి అనే విషయమై గొడవ జరిగింది. స్థానిక నేతల జోక్యంతో ఇది సమసిపోయింది. గురజాల డివిజన్‌లో తొలిరోజు ఒకటి రెండు చోట్ల స్వల్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిపై కూడా ఇరుపార్టీలను పిలిచి మాట్లాడతామని ఇక మీదట ఇలాంటి వాటికి తావు లేకుండా మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయి యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కసరత్తు...మూడు దశల్లో ప్రక్రియ పూర్తి !

ABOUT THE AUTHOR

...view details