Additional DGP On GO No 1 : బహిరంగ సభలు, సమావేశాలపై జీవో నంబరు-1 ప్రకారం నిషేధం విధించలేదంటారు. మరి దాని ఆధారంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం పర్యటనను ఎందుకు అడ్డుకున్నారని అడిగితే షరతులన్నీ పాటించలేదంటారు. వైసీపీ నాయకులు నందిగామలో జాతీయ రహదారిపై వీరంగం సృష్టించి.. బాణసంచా మోతలతో భారీ ర్యాలీ చేసినప్పుడు వారికి ఆంక్షలు ఎందుకు వర్తింపజేయలేదని ప్రశ్నిస్తే దానికి నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.
ప్రత్యేక, అరుదైన సందర్భాల్లో అనుమతివ్వొచ్చని అంటున్నారు కదా! అవేంటో వివరించాలని అడిగితే నీళ్లు నమిలారు. ఆ ప్రత్యేక, అరుదైన సందర్భాలు వైసీపీ వారి కోసమే ప్రత్యేకమా? అని ప్రశ్నిస్తే సూటిగా సమాధానమివ్వలేదు. ఇదీ.. ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ తీరు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో1లో ఎక్కడా నిషేధం అన్న పదమే వాడలేదన్నారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగానే సభలు, సమావేశాలపై ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది అవాస్తవమన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణిలో సమాధానమిచ్చారు. వివరాలివీ...
విలేకరి:జీవో1 ద్వారా బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించలేదని మీరే చెబుతున్నారు. మరి దాన్నే కారణంగా చూపించి చంద్రబాబు కుప్పం పర్యటనను ఎందుకు అడ్డుకున్నారు?
ఏడీజీపీ:అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిర్దేశిత షరతుల్లో కొన్నింటిని పాటించలేదు. వాటిని పాటిస్తే అనుమతిస్తామని పలమనేరు డీఎస్పీ లిఖితపూర్వకంగా వారికి తెలియజేశారు. షరతులన్నీ పాటించి ఉంటే కచ్చితంగా అనుమతిచ్చేవాళ్లం.
విలేకరి:పలమనేరు డీఎస్పీ విధించిన ఆ షరతులేంటి?
ఏడీజీపీ: మీకు ఆ వివరాలు పంపిస్తాం. (అలా చెప్పారే కానీ... వివరాలు మాత్రం ఇవ్వలేదు)
విలేకరి:నందిగామలో వైకాపా నాయకులు జాతీయ రహదారిపైనే భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తే వారిని అడ్డుకోలేదు సరికదా? పోలీసులే రక్షణ కల్పించారు. మరి దీన్నెలా చూడాలి?
ఏడీజీపీ: ఎక్కడైనా సభలకు అనుమతివ్వాలంటే నిర్వాహకులు ఏయే షరతులు పాటించాలో వివరిస్తూ ఒక ప్రొఫార్మా సిద్ధం చేశాం. దాన్ని అన్ని జిల్లాల ఎస్పీలకు, జిల్లాల యంత్రాంగానికి పంపిస్తాం. ఆబ్జెక్టివ్‌గా వ్యవహరిస్తాం.
విలేకరి:ప్రత్యేక, అరుదైన సందర్భాల్లో మాత్రమే రహదారులపై సభలు పెట్టుకోవడానికి అనుమతిస్తామని జీవోలో పేర్కొన్నారు. అవి వైకాపా వారికి మాత్రమే వర్తిస్తాయా?
ఏడీజీపీ: అవి స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఆయా ప్రాంతాల జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు కలిసి వాటిని నిర్ణయిస్తారు. జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వ ఆస్తులు. వాటిపై సభలు నిర్వహిస్తే ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఆ వివరాలన్నింటినీ జీవోలో వివరించాం. మేం తయారు చేసిన ప్రొఫార్మాలోని షరతులన్నీ పాటించారా? లేదా? అనేదాన్ని బట్టి అనుమతులుంటాయి.
విలేకరి:శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ హోదాలో జీవో1 అనేది అధికార, ప్రతిపక్షాలకు ఒకేలా వర్తిస్తుందని హామీ ఇవ్వగలరా? అలా చేయని అధికారులపై చర్యలు తీసుకోగలరా?