Achchennaidu on YCP Attacks on SC, ST and BCs:బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై అధికార పార్టీ నాయకులు ఇన్నాళ్లూ గాఢ నిద్రలో ఉండి.. మళ్లీ మోసం చేసేందుకు బస్సు యాత్ర అంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుమండిపడ్డారు. పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి పేరుతో తెలుగుదేశం కరపత్రం విడుదల చేసింది. ఎన్టీఆర్ భవన్లో వివిధ వర్గాలపై వైసీపీ చేసిన దాడులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అచ్చెన్నాయుడు, ముఖ్య నేతలు తిలకించారు. బడుగులను ఊచ కోత కోసి, హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. దారి మళ్లించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల గురించి సమాధానం చెప్పి వైసీపీ బస్సు యాత్ర చేపట్టాలని హితవు పలికారు. నిధుల్లేని.. ఆర్థిక సాయం అందించలేని కార్పోషన్లను ఏర్పాటు చేసి బీసీ కులాలను మోసం చేశారని ఆక్షేపించారు. బీసీలకు అన్యాయం జరుగుతోంటే నోరు తెరిచి మాట్లాడలేని బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని ధ్వజమెత్తారు. పవర్ లేని పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తే లాభమేముందని ప్రశ్నించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను జగన్ మోసం చేస్తున్నాడని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పెత్తందారు జగన్.. పేదల గొంతు కోసే పాలన చేస్తూ అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ఎస్టీలవి 29 పథకాలు, మైనారిటీలవి 11 పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు. ఇన్నేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఇంత ఊచకోత.. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, అక్రమాలు ఎప్పుడైనా చూశామా? అంటూ మండిపడ్డారు. ఇన్ని అరాచకాలపై జగన్‌ను ఏ మంత్రికి అయినా ప్రశ్నించే ధైర్యం ఉందా అని అన్నారు. రాష్ట్రాన్ని సొంత కుటుంబసభ్యులు నలుగురికి ధారాదత్తం చేశారని ఆగ్రహించారు. ఉత్తరాంధ్రకు సొంత చిన్నాన్న సుబ్బారెడ్డిని సామంతరాజుగా నియమించారని అన్నారు.