ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులే విత్తనోత్పత్తిదారులు కావాలి: డా. ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి - ఏపీలో పండించే పంటలు

రైతులకు కావాల్సిన విత్తనాలను వారి పొలంలోనే పండించుకోవాలనేదే తమ లక్ష్యమని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఇది సాకారం కావాలంటే రైతులే విత్తన ఉత్పత్తిదారులు కావాలన్నారు. విత్తనోత్పత్తి ద్వారా మార్కెట్‌ ధర కంటే అదనపు ఆదాయం సాధించొచ్చని పేర్కొన్నారు.

Vishnuvardhan Reddy
డా.ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి

By

Published : Jun 28, 2021, 10:03 AM IST

రైతులు పండించే విత్తనం దేశమంతటికీ చేరాలి.. ఇది సాకారం కావాలంటే రైతులే విత్తన ఉత్పత్తిదారులు కావాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. కావాల్సిన విత్తనాలను వారి పొలంలోనే పండించుకోవాలనేదే తమ లక్ష్యం పేర్కొన్నారు. దీనివల్ల విత్తనాల కోసం ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం ఉండదు.. విత్తనోత్పత్తి ద్వారా మార్కెట్‌ ధర కంటే అదనపు ఆదాయమూ సాధించొచ్చు అని వివరించారు. సొంత విత్తనాలను తయారు చేసుకునే దిశగా రైతులకు కల్పిస్తున్న ప్రోత్సాహం, విశ్వవిద్యాలయం తీసుకుంటున్న చర్యలను ‘ఈనాడు’కు వివరించారు.

అధికంగా సాగయ్యే పంటలన్నీ మన విత్తనాలతోనే..
రాష్ట్రంలో ఏటా 62 లక్షల ఎకరాల్లో వరి, 19 లక్షల ఎకరాల్లో వేరుసెనగ, 12 లక్షల ఎకరాల్లో సెనగ పంటల్ని సాగు చేస్తారు. అధిక విస్తీర్ణంలో సాగు చేసే ఈ ప్రధాన పంటలన్నింటికీ మన విత్తనమే వినియోగిస్తారు. దీంతో ఖర్చు కూడా తగ్గుతుంది. పత్తి, మొక్కజొన్న, జొన్న, మిరప, సజ్జ, కూరగాయ పంటలకు హైబ్రిడ్‌పై ఆధారపడాల్సి వస్తోంది.

ఎకరానికి రూ.10వేలకు పైగా అదనపు ఆదాయం
విత్తనాలను బయట కొనకూడదనే దిశగా అవగాహన కల్పిస్తున్నాం. మూల విత్తనం ఇచ్చి.. వారే ఉత్పత్తి చేసుకునే పద్ధతులు నేర్పిస్తున్నాం. పంట పండించిన తర్వాత మార్కెట్‌ ధర కంటే కిలోకు రూ.5 చొప్పున అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. దీంతో ఎకరాకు రూ.10వేల వరకు అదనపు ఆదాయం వారికి లభిస్తుంది. ఎక్కువ మంది రైతులు పండిస్తే.. ప్రైవేటు సంస్థలు కూడా వారి వద్దకు వచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తాయి. దీంతో వారి ఆదాయం పెరగడమే కాకుండా.. మన విత్తనం దేశమంతటికీ వెళ్తుంది. విత్తన పంట సాగు సమయంలో కల్తీలను రైతులే గుర్తించవచ్చు. ఎత్తుగా పెరగడమో.. ఇతర మొక్కల కంటే భిన్నంగానో ఉంటాయి. వాటిని తొలగిస్తే.. మిగిలినదంతా నాణ్యమైన విత్తనానికి ఉపయోగించుకోవచ్చు.

అన్నదాతలు పండించిందే
ఖరీఫ్‌లో రైతులకు సరఫరా చేసిన 4 లక్షల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనం రైతులు పండించిందే. టెండరుకు వెళ్లకుండా మొత్తం వారి నుంచే సేకరించాం. దీనికి కావాల్సిన మూల విత్తనం సరఫరా బాధ్యతను విశ్వవిద్యాలయం తీసుకుంది. ఇలా మరిన్ని కొత్త రకాలను రైతులతో ఉత్పత్తి చేయిస్తే.. విత్తనం కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

అంటుకట్టిన మొక్కలూ సరఫరా..
వర్సిటీ పరిధిలోని ఉద్యాన శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో పండ్లు, కూరగాయ పంటల మొక్కలనూ అభివృద్ధి చేస్తున్నాం. అంటుకట్టిన విధానంలోని బత్తాయి, మామిడి, జీడిమామిడి మొక్కలతో పాటు మిరప, వంగ, టమోటా తదితర పంటలకు సంబంధించి 7.36 లక్షల మొక్కలను రైతులకు అందించాం. షేడ్‌నెట్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటి అభివృద్ధికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయనుంది.

లక్ష క్వింటాళ్ల విత్తనోత్పత్తి లక్ష్యం
విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో గతంలో 16వేల క్వింటాళ్ల విత్తనాల ఉత్పత్తి జరిగేది. దీన్ని గతేడాది 43వేల క్వింటాళ్లకు చేర్చాం. తక్కువ ధరలో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాం. ఈ ఏడాది లక్ష క్వింటాళ్ల విత్తనాలను తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఒప్పంద విధానంలో రైతుల పొలాల్లోనే పండిస్తున్నాం. ఇలా వరి, వేరుసెనగ, కందులు, పెసలు, మినుము, చిరుధాన్యాలకు సంబంధించి 22వేల క్వింటాళ్లను ఉత్పత్తి చేయించాం. ఈ ఏడాది ప్రకాశం జిల్లా చినపవనిలో కేటాయించిన భూమిలో 200 ఎకరాల్లో పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, వరి విత్తనాలను ఉత్పత్తి చేయబోతున్నాం. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొంతమేర విత్తనాలను విక్రయించాం. వచ్చే ఖరీఫ్‌ నాటికి మరిన్ని విత్తనాలను రైతులకు అందించాలని నిర్ణయించాం.

ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేసేలా..
మార్కెట్లో ఉన్న హైబ్రిడ్‌ రకాల కంటే వర్సిటీ రూపొందించిన విత్తనాలు ఎంతో మేలైనవి. వీటి జెనెటిక్‌ మెటీరియల్‌ లైన్స్‌ను ప్రైవేటు సంస్థలకు విక్రయించడం ద్వారా మన సాంకేతికత దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. దీంతో మూల విత్తన లభ్యత పెరుగుతుంది. ఇప్పటికే పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. వారితో కలిసి ఎలా పనిచేయాలి? అనే అంశంపై పాలసీ రూపొందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే.. ముందుకు వెళ్తాం.

ఇదీ చదవండి

BC LEADERS: ప్రభుత్వ వైఫల్యాలపై జులై 2న రాష్ట్ర వ్యాప్త నిరసనలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details