Acharya Nagarjuna University: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని మూల్యాంకన కేంద్రంలో వర్సిటీ సిబ్బంది మరోసారి నిబంధనలకు నీళ్లొదిలారు. మార్కుల ట్యాంపరింగ్ ఘటన మరువకముందే.. మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విశ్వవిద్యాలయంలో బీఈడీ మూడో సెమిస్టర్ ఫిజిక్స్ పత్రాల మూల్యంకన జరుగుతోంది. ఏఎన్‌యూ పరిధిలోని ఓ బీఈడీ కళాశాలలో పని చేసే అధ్యాపకులు ప్రేమ్ కుమార్‌కు డీఎస్సీ 98లో ఉద్యోగం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రేమ్‌కుమార్‌కు ANUలోని మూల్యాంకన కేంద్రంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
దైవ ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం అక్కడే ఇతర అధ్యాపకులకు విందు ఏర్పాటు చేశారు. మూల్యాంకన జరిగే సమయంలో ఇతరులను ఎవరినీ ఆ ప్రాంతంలోకి రానివ్వరు. అయినా అధ్యాపకులు నిబంధనలు ఉల్లఘించి విందు కార్యక్రమం నిర్వహించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై పీజీ పరీక్షల సమన్వయకర్త ఉదయ కుమార్‌ను వివరణ కోసం రెండు సార్లు ఫోన్ చేయగా స్పందించలేదు. సీటీఏ పూర్ణచంద్రరావును వివరణ కోరగా ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదన్నారు.
మొదటి సెమిస్టర్లో ఉత్తీర్ణత.. రెండో సెమిస్టర్లో అరకొర మార్కులు: మరో ఘటనలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థులు గత మార్చి 15న విడుదలైన సెకండ్ సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో వచ్చిన మార్కులను చూసి ఆవేదన చెందుతున్నారు. మొదటి సెమిస్టర్ పరీక్షలో అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణత చెందిన కొందరు విద్యార్థులకు.. రెండో సెమిస్టర్ ఫలితాల్లో ఒక మార్కు, మూడు మార్కులు, ఐదు మార్కులు వేశారు. అసలు ఈ మార్కులు కూడా ఎందుకు వేశారో తెలియని అయోమయంలో ఆ విద్యార్థులు ఉన్నారు.