బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. హత్య ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు చెప్పారు. కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని డీజీపీ తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.
సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. యువతులు, మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఘటన జరిగిన వెంటనే వేగంగా స్పందించి కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు. మహిళల రక్షణ తమ ప్రథమ కర్తవ్యమని, ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.