గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అవినీతి పెచ్చుమీరి పోయింది. ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా కార్యాలయంలో పెత్తనం చెలాయిస్తూ పెద్ద ఎత్తున నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారుల బృందం చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..విస్తుపోయే నిజాలు - అవినీతి తిమింగలాలను పట్టుకున్న అనిశా అధికారులు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా పెత్తనం చెలాయిస్తున్న పది మంది డాక్యుమెంట్ రైటర్లు, ముగ్గురు ప్రైవేటు ఉద్యోగులను గుర్తించారు. వీరి నుంచి రూ. 80 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కార్యాలయంలో అనధికారికంగా విధులు నిర్వర్తిస్తున్న పది మంది డాక్యుమెంట్ రైటర్లను అధికారులు గుర్తించారు. వీరి నుంచి రూ. 58,210 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు కార్యాలయంలో పెత్తనం చెలాయిస్తున్న మరో ముగ్గురు సోదరులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద అనధికారికంగా ఉన్న రూ 21,910 ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.