RURAL PEPOLE WAITING FOR HOUSES : వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో.. గ్రామీణ పేద ప్రజల సొంత ఇంటి నిర్మాణం.. అందని ద్రాక్షగానే మిగులుతోంది. అధికారం చేపట్టి సుమారు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా.. జగన్ ప్రభుత్వం మాత్రం ఒక్కటంటే ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు. సుమారు రెండు లక్షల 50వేల మంది ఇంటి నిర్మాణం కోసం ఎదురుచూస్తుండగా.. రెండు సంవత్సరాల క్రితమే వీరికి ఇంటి స్థలాలు కేటాయించింది. కానీ నిర్మాణాల ఊసు మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే రెండో దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాల్లో వీటిని చేర్చారు. కానీ వృథా ప్రయాసే అయ్యింది. 5 నెలల క్రితమే రెండో దశ కింద సుమారు 3 లక్షల నిర్మాణాలను ప్రారంభించినా.. గ్రామీణ పేదలకు మాత్రం వాటిని మంజూరు చేయలేదు.
రాష్ట్రంలో "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకం" కింద వైఎస్సార్సీపీ సర్కార్ జగనన్న కాలనీలు, ప్రజల సొంత స్థలాల్లో 16 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను చేపడుతోంది. ఇవన్నీ నగరాలు, పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లోనే ఉన్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి పట్టణాభివృద్ధి సంస్థల్లో కేంద్రం దాదాపు లక్షా 80 వేల రూపాయలు ఇస్తుండగా.. నగరాలు, పట్టణాల్లో రూ.లక్షా 50 వేలు అందిస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.30 వేలు ఇస్తోంది.
2020 డిసెంబరులో ఇంటి నిర్మాణం ప్రారంభం సందర్భంగా.. మొదటి దశలో 15.60 లక్షలు, రెండో దశలో 13 లక్షలు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అప్పట్లోనే రెండో దశలో గ్రామీణ ఇళ్లను చేర్చింది. మొదట్లో గ్రామీణ ప్రాంతంలో 4 లక్షల వరకు ఇళ్లను నిర్మించాల్సి ఉంటుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు లెక్కగట్టారు.నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకం గ్రామాలకు వర్తించదు. గ్రామీణ పేదల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి కేంద్రం గతంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసింది. రాష్ట్రంలో ఈ పథకానికి 1.80 లక్షల మందిని అర్హులుగా గుర్తించి, సాయాన్ని వారికి అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 4 లక్షల మంది గ్రామీణ పేదలకు.. ఈ రెండు పథకాలు వర్తించవు. ఫలితంగా వీరికి సంబంధించిన పూర్తి ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రమే భరించాల్సిన పరిస్థితి.