ఫాస్టాగ్‌ను ఇప్పటికే ప్రయోగాత్మకంగా 2014 నుంచి వివిధ జాతీయ రహదారులపై అమలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్‌ప్లాజాల్లో కొన్నిలైన్లలో తప్పనిసరి చేశారు. ఈ డిసెంబరు 1 నుంచి ఒక్క లైన్ మినహా మిగిలినవన్నీ ఫాస్టాగ్‌కే కేటాయిస్తారు. నగదు చెల్లించే వాహనదారులకు ఒక్క లైన్ మాత్రమే మిగులుతుంది. ఈ మేరకు వాహనదారులను అప్రమత్తం చేస్తూ... ప్రతి టోల్‌ప్లాజా వద్ద బ్యానర్లు కనిపిస్తున్నాయి.
ఫాస్టాగ్ ఎందుకు..?
టోల్‌ప్లాజాల వద్ద వాహనం ఆగకుండా వెళ్లిపోయేందుకు వీలుగా ఉపయోగపడే చిన్న సాంకేతిక సాధనమే ఈ ఫాస్టాగ్. నగదు రహిత, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. చిన్న ఎలక్ట్రానిక్ చిప్ రూపంలో ఉండే దీన్నీ... వాహనం ముందుండే అద్దం లోపలివైపు అతికిస్తారు. వాహనం టోల్‌ప్లాజా లైన్‌లోకి రావడంతోనే అక్కడ అమర్చిన ఎలక్ట్రానిక్ పరికరం వాహన ఫాస్టాగ్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబరు, మన పేరును గుర్తించి, ఖాతా నుంచి టోల్ రుసుంను ఆన్‌లైన్‌లోనే తీసుకుంటుంది. ఇదంతా 10 సెకండ్లలోనే జరిగుతుంది
ఎక్కడ... ఎలా తీసుకోవాలి..?
అన్ని టోల్‌ప్లాజాలు, 22 ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకుల్లో దీన్నీ పొందవచ్చు. త్వరలో ఎన్‌హెచ్‌ఏఐ సొంతంగానూ ఇవ్వనుంది. అమెజాన్, పేటీఎంల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ చిప్‌ను టోల్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన బ్యాంకు సేల్ పాయింట్లలో ఒకసారి రిజిస్టర్ చేసుకోవాలి. చిప్ పొందడానికి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), వాహనదారుడి గుర్తింపు కార్డు జిరాక్సు ప్రతులు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకెళ్లాలి.
తొలిసారి ఎంత చెల్లించాలి... ఎంత నగదు నిల్వ ఉండాలి..?
కారుకు తొలుత రూ.500 చెల్లిస్తే చాలు. అందులో రూ.100 ఫాస్టాగ్ రుసుం, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్, మిగిలిన రూ.200 ఫాస్టాగ్ ఖాతాలో టాప్‌అప్‌గా ఉంటుంది. ఈ ఖాతాలో కనీసం రూ.200 ఉండాలి. తర్వాత ఆన్‌లైన్‌లో అవసరమైన మేరకు మన బ్యాంకు ఖాతా ద్వారా రీఛార్జి చేసుకోవచ్చు. ఒక్కో వాహనానికి వేర్వేరు ధరలు ఉంటాయి.
బ్యాంకు ఖాతా అనుసంధానం ఎలా?
ఫాస్టాగ్ తీసుకున్న తర్వాత, ఆండ్రాయిడ్ ఫోనులో ‘మై ఫాస్టాగ్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో బ్యాంకు ఖాతా, వాహన నంబర్లను నమోదు చేసుకొని లింకు చేసుకోవచ్చు. ప్రతి టోల్‌ప్లాజా దాటిన తర్వాత వాహనదారుడి మొబైల్‌కి మినహాయించుకున్న రుసుం వివరాలతో సందేశం వస్తుంది.
ఎంత కాల పనిచేస్తుంది..?
ఇది వాహనం ఉన్నంతకాలం పనిచేస్తుంది. ఒక వాహనానికి తీసుకొని, మరో వాహనానికి మారిస్తే పనిచేయదు. ఫాస్టాగ్‌ను మరో వాహనానికి మార్చి... ఏదైనా టోల్‌ప్లాజా మీదుగా వెళితే... ఆటోమెటిక్ వెహికిల్ కౌంటింగ్ క్లాసిఫికేషన్(ఏవీసీసీ) ద్వారా దాన్ని గుర్తించి... తర్వాత టోల్‌ప్లాజాలోకి వెళ్లేసరికే అది బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లిపోతుంది.
ఇప్పుడు తీసుకోకపోతే ఏమవుతుంది..?
డిసెంబరు 1 తర్వాత టోల్‌ప్లాజాలో కేటాయించిన ఒక్కలైన్‌లో మాత్రమే నగదు చెల్లించి వెళ్లాలి. ఆ మార్గంలో క్యూలో నిరీక్షించక తప్పదు. ఒకవేళ పక్కన ఖాళీగా ఉన్న ఫాస్టాగ్ లైన్‌లో నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం రెట్టింపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
రాయితీలు, నెలవారీ పాసులు కొనసాగుతాయా..?
టోల్‌ప్లాజాకు 20 కిలోమీర్ల పరిధిలో నివాసం ఉండేవారి వాహనాలకు స్థానిక కోటాలో రాయితీ ఇస్తున్నారు. ఫాస్టాగ్ పొందిన వాహనదారులు సంబంధిత టోల్‌ప్లాజాలో వివరాలు తెలియజేస్తే... వారికి గతంలో మాదిరిగా స్థానిక రుసుంనే మినహాయించుకుంటారు. ఒక నెలలో ఎక్కువ ట్రిప్పులు తిరిగే వారికి నెలవారీ పాసులూ ఉంటాయి.