ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

housing scheme: 46 వేల ఇళ్ల రద్దుకు సిద్ధమైన జగన్‌ సర్కార్... - ap crime

Abolishment of Sanctioned Houses: 46 వేల మంది కడు పేదలకు కేటాయించిన ఇళ్లను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ స్థానంలో అమరావతి లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించనున్నట్లు కేంద్రానికి నివేదించి. తమకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదని బడుగు, బలహీనవర్గాలు మొర పెట్టుకుంటున్నా కనికరించడం లేదని... ప్రభుత్వమే ఇళ్లు కట్టించాలని లబ్ధిదారులు కోరుతున్నా... ప్రభుత్వం నిపించుకోవడం లేదు.

Poor People Concern
Abolishment of Sanctioned Houses

By

Published : Jun 7, 2023, 9:40 AM IST

46 వేల మంది కడు పేదల ఇళ్లను రద్దు చేయబోతున్న జగన్‌

Abolishment of Sanctioned Houses in AP: పేదల ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పిడుగువేయబోతోంది. పేదలకు గూడు కల్పించడమే లక్ష్యమంటూ ఊదరగొట్టే జగన్ సర్కార్.. రకరకాల సాకులతో 46 వేల మంది గృహాల రద్దుకు సిద్ధమైంది. ఆ స్థానంలో అమరావతి లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించనుంది. ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించి.. పాతవాటి స్థానంలో కొత్త ఇళ్లకు ఆమోదం పొందేలా పయత్నాలు చేస్తోంది.

సందర్భం ఏదైనా, వేదిక ఏదైనా సరే.. పేదలపై తమకే పేటెంట్‌ హక్కు ఉందనేలా పదే పదే మాట్లాడే ముఖ్యమంత్రి జగన్‌.. అదే పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు. 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 22 లక్షల గృహాల్ని కట్టిస్తున్నామని చెప్పే ఆయన.. ఆర్థిక స్తోమత లేక కట్టుకునేందుకు ముందుకురాని 46 వేల మంది కడు పేదలకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయబోతున్నారు. గడిచిన రెండేళ్లలో ఇప్పటికే పలుమార్లు కొన్ని వేల మంది పేదల ఇళ్లను రద్దు చేశారు. అది బయటికి రాకుండా.. వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను చేర్చి లెక్క సరిచేస్తున్నారు.

2020 డిసెంబర్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ప్రభుత్వమే ఇళ్లు కట్టించాలని లబ్ధిదారులు అడిగితే.. నిర్మించి తాళాన్ని వారి చేతికి ఇస్తామని జగన్‌ చెప్పారు. కానీ ఆ తర్వాత చేతులెత్తేశారు. తమకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదని బడుగు, బలహీనవర్గాలు మొర పెట్టుకుంటున్నా కనికరించడం లేదు. నిర్దాక్షిణ్యంగా రద్దు జాబితాలో చేర్చేస్తున్నారు. పేదల పక్షాన నిలవడమంటే ఇదేనా అని అభాగ్యులు ప్రశ్నిస్తున్నారు. రద్దు చేయబోతున్న ఈ ఇళ్ల స్థానంలోనే... రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయించిన వారికి మంజూరు చేయాలని కేంద్రానికి నివేదించనున్నారు. ఈమేరకు కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు.

మొత్తంగా 148 ప్రాజెక్టుల పరిధిలోని 46 వేల 928 గృహాల్ని రద్దు చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో అత్యధికంగా నంద్యాల జిల్లాలో 8వేల 959 ఇళ్లు ఉండగా... ఆ తర్వాత స్థానం ముఖ్యమంత్రి సొంత జిల్లా వైయస్‌ఆర్‌దే. ఇక్కడ 15 ప్రాజెక్టుల పరిధిలో 8వేల 126 ఇళ్లను రద్దు జాబితాలో చేర్చారు. అనకాపల్లి జిల్లాలో 4వేల 806, పల్నాడులో 3వేల 94 ఇళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. 26 జిల్లాల ప్రాతిపదికన చూస్తే 9 జిల్లాల్లో 2 వేలకు పైగా గృహాల్ని రద్దు చేయబోతున్నారు.

'ఆ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి'
‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’పథకం పర్యవేక్షణకు సెంట్రల్‌ శాంక్షనింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ - సీఎస్ఎంసీ సమావేశాన్ని నెలకోసారి నిర్వహిస్తారు. కమిటీ ఆమోదిస్తేనే ఈ పథకం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మినహా ఇంటి నిర్మాణానికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వ సాయంపైనే ఆధారపడింది. అందువల్ల ఇళ్ల మంజూరుకు సీఎస్ఎంసీ ఆమోదం తప్పనిసరి.

ఈ పథకం కింద వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు మంజూరు చేసిన ఇళ్లను 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం నిర్దేశించింది. కొన్ని నెలలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని కోరినా ససేమిరా అంటోంది. దీంతో కొత్త ఎత్తుగడ వేసిన జగన్‌ ప్రభుత్వం... వివిధ కారణాలతో ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు రాని పేదల పేరిట మంజూరైనవి రద్దు చేసి, కొత్తగా ఎంపిక చేసిన వారి పేరు మీద కేటాయించాలని కోరుతోంది. ఆ ప్రకారమే కేంద్రం కూడా అనుమతి ఇస్తోంది. తాజాగా ఇతర ప్రాంతాల వారికి అమరావతిలో 50 వేల ఇళ్ల స్థలాలు కేటాయించింది.

వీరి ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. జులైలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి... ఈ నెలలో దిల్లీలో జరిగే సీఎస్ఎంసీ సమావేశంలో కేంద్ర అనుమతి పొందేలా అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 46వేల 928 ఇళ్లను రద్దు చేసి వాటి స్థానంలో 53వేల 11 గృహాల్ని కొత్తగా మంజూరు చేయాలని కోరబోతున్నట్లు తెలిసింది. కొత్త ఇళ్ల మంజూరులో ఎన్టీఆర్‌ జిల్లాకు 23వేల 821, గుంటూరు జిల్లా 23వేల 196, వైయస్‌ఆర్‌ జిల్లా 2వేల 431, ప్రకాశం జిల్లా 18వందల 66, మిగతావి కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఉన్నాయి.

స్టీల్ ప్లాంట్ కోసం పేలుళ్లు చేస్తే.. పేదల ఇళ్లు కూలిపోతాయ్: గౌరు చరిత

ABOUT THE AUTHOR

...view details