Buying TRS MLAs Issue Update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఆరుగురు పోలీసు అధికారులున్నారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ వేంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మెయినాబాద్ సీఐ లక్ష్మీరెడ్డి సభ్యులుగా ఉన్నారు.
సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎన్నో ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల సేకరణతో ముడిపడి ఉన్న దర్యాప్తును సిట్ అధికారులు ముందుకు తీసుకెళ్తారని హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ఎర కేసులో ముగ్గురు నిందితులను మెయినాబాద్ పోలీసులు 28వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించడంతో పోలీసులు ముందుకు వెళ్లలేకపోయారు. భాజపా వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా దర్యాప్తుపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.