సరకు నిల్వలతో గుంటూరు మిర్చియార్డు ఎరుపెక్కింది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రం తెలంగాణ జిల్లాల నుంచి సరుకు పెద్ద ఎత్తున తరలివచ్చింది. 4 రోజుల సెలవుల అనంతరం.. మంగళవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం, బుధవారం సరుకు పెద్దఎత్తున వచ్చినప్పటికీ.. కరోనా కారణంగా విదేశీ ఎగుమతులు లేక అమ్మకాలు మందగించాయి. ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గత వారంతో పోలిస్తే వెయ్యి నుంచి 15వందల రూపాయల వరకూ ధర తగ్గిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
మిర్చి ధరలపై తీవ్ర ప్రభావం చూపిన వరుస సెలవులు - గుంటూరు మిర్చి యార్డులో వరుస సెలవులు
గుంటూరు మిర్చియార్డుకు వరుసగా వచ్చిన సెలవులు.. ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. సరుకు తెచ్చిన రైతుకు నిరాశే మిగిలింది. యార్డులో సరుకు పేరుకుపోవటంతో.. ఇదే అదనుగా వ్యాపారులు ధర తగ్గించేశారు. ఈ పరిస్థితుల్లో రైతులు అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మిర్చి ధరలపై తీవ్ర ప్రభావం చూపిన వరుస సెలవులు
క్వింటాకు 15వేల వరకూ పలికిన మేలు రకాలు 14వేలలోపే అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం ధర తక్కువగా ఉందని.. మరుసటి రోజు అమ్ముకుందామంటే.. బుధవారం మరింత పతనమయ్యాయని రైతులు వాపోతున్నారు. నాణ్యత పేరుతో వ్యాపారులు ఆంక్షలు పెడుతూ.. తమ నోట్లో కారం కొడుతున్నారని మండిపడ్డారు. సరుకు ఎక్కువగా రావటంతో యార్డులో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. మంచి ధర వస్తోందన్న ఆశతో కొంతమంది రైతులు ఎదురుచూస్తున్నారు.