గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్ఐ జగదీష్ తనను లొంగదీసుకుని అన్యాయం చేశాడని ఓ మహిళ నరసరావుపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆమె కేసు కొత్త మలుపు తిరిగింది. ఎస్సై జగదీష్‌కి ఆమెకు ఎలాంటి సంబంధం లేదని ఆమె మాజీ భర్త మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడానికే తన మాజీ భార్య ఇలా చేస్తోందని ఆరోపించారు.
ఇదీ జరిగింది
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన సింధూర అనే మహిళ... సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల పోలీసు స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జగదీష్‌పై నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది.
'2013లో నా భర్తతో మనస్పర్థల కారణంగా నరసరావుపేట గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చాను. అప్పటి ఎస్సై జగదీష్... తప్పుడు కేసులు పెడతానంటూ నన్ను బెదిరించి లొంగదీసుకున్నారు. ఆ తరువాత నా భర్తతో స్నేహం పేరుతో జగదీష్ ప్రతి రోజూ మా ఇంటికి వచ్చిపోయేవాడు. అతని వల్ల నేను ఒక బిడ్డకు తల్లిని కూడా అయ్యాను. ఎస్సైకి వివాహం అయిన సంగతి నాకు ఆలస్యంగా తెలిసింది. 2017లో నా మొదటి భర్తకు విడాకులు ఇచ్చాక ఎస్సై నన్ను రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడు. అయితే కొద్ది రోజులగా జగదీష్‌కు... ఆయన మొదటి భార్యతో విబేధాలు రావటంతో నన్ను, నా బిడ్డను వేధింపులకు గురిచేస్తున్నాడు. బిడ్డతో సహా వెళ్లిపోవాలని బెదిరిస్తున్నాడు. నాకు, నా బిడ్డకు ఎస్సై జగదీష్ వల్ల ప్రాణహాని ఉంది'. అని సింధూర నరసరావుపేట గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.