MULTI PURPOSE ECO FREINDLY AGRO MACHINE : తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని పారామిత పాఠశాల విద్యార్థిని శుభశ్రీ సాహు సీబీఎస్ఈ నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ 2022-23 విజేతగా నిలిచింది. జాతీయ స్థాయిలో సీబీఎస్సీ పాఠశాలల్లో “పర్యావరణ” విభాగంలో శుభశ్రీ రూపొందించిన నమూనా ఉత్తమ ప్రాజెక్ట్‌గా ఎంపిక కావడంతో పాఠశాల విద్యార్దుల్లో ఆనంద వ్యక్తం అవుతోంది.. శుభశ్రీ తండ్రి లలిత్ మోహన్ సాహు.. ఇదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా.. ప్రాజెక్టు రూపకల్పనలో సలహాలు సూచనలు ఇచ్చారు.
సాధారణంగా రైతులు పండించిన వరిని కోసి ధాన్యం వేరు చేయాలంటూ ప్రస్తుతం అంతటా హార్వెస్టర్లు(వరికోత యంత్రాలు) వినియోగిస్తున్నారు. అయితే చిన్న సన్నకారు రైతులు హార్వెస్టర్ల వినియోగం తలకు మించిన భారంగా భావిస్తారు.. హార్వెస్టర్లు అద్దెకు తీసుకునే స్థోమత ఉండదు.అయితే వేసవి సెలవుల్లో ఒడిషాలోని తమ సొంతూరుకు వెళ్లినప్పుడు శుభశ్రీ ఈ కష్టాలను గుర్తించింది. వరికోసం చేనులో పంజగొట్టడం, ఎద్దులతో బంతి కొట్టించి వరి వేరు చేయడం.. తర్వాత వాటిని తూర్పార పడుతుండగా దుమ్మూదూళి నోట్లోకి, ముక్కుళ్లోకి పోయి అనారోగ్యానికి గురికావడం శుభశ్రీ కలత చెంది రైతులు పడుతున్న సమస్యకు తనవంతుగా ఏదైనా ఆలోచించి ఈ పరికరాన్ని తయారు చేసినట్లు శుభశ్రీ వివరించింది.
ఇంతకూ శుభశ్రీ రూపొందించిన యంత్రం ఉపయోగాలు తెలుసుకుంటే ఇంత చిన్న వయస్సులో అంత పెద్ద ఆలోచన ఎలావచ్చిందా అని ఆశ్చర్య పోక తప్పదు. రైతుల ప్రయోజనం కోసం “మల్టీ ఫంక్షనల్ ఎకో ఫ్రెండ్లీ ఆగ్రో మెషిన్” ద్వారా అనేక పనులు చేసుకోవచ్చు. కోసిన వరి లేదా, గోదుమ పంటను ఈ మిషన్లో వేస్తే... వడ్లను వేరు చేయవచ్చు. అంటే ధాన్యం నూర్పిడి చేస్తుందన్న మాట. ఇలా చేసే క్రమంలో ధాన్యం పూర్తిగా వరి నుంచి వేరుపడి... అందులోని దుమ్ముదూళి మిషన్ లోనే వేరు పడిపోతుంది. ఇదే తరహాలో గోదుమ పంట కోసి మిషన్లో వేస్తే గోధుమలు వేరే, అందులోని గోధుమ గడ్డి వేరేగా అయిపోతాయి. ఇలా వచ్చిన ధాన్యాన్ని లేదా గోధుమమలు సంచుల్లో నింపి.. ఇదేమిషన్ పై కుట్టు వేసే విధంగా కూడా ఈ మిషన్ రూపకల్పన చేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా ధాన్యం, గోధుమలు వేరు చేసిన తర్వాత వచ్చిన గడ్డిని ఇదే మిషన్లో వేస్తే.. పశువుల మేతకు కావాల్సిన విధంగా కట్ చేస్ చాపర్ లాగా కూడా ఈ మిషన్ ను వాడుకోవచ్చు. అంతేకాదు.. కూరగాయలు, పండ్లు లాంటివి వేస్తే పశువులు మేసేందుకు వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి.. ఇలా అనేక రకాల పనులు చేసి పెట్టే ఈ యంత్రానికి ఎలాంటి ఇంధనమూ అవసరం లేదు. ఈ యంత్రం నడిచేందుకు వీలుగా అమర్చిన మోటార్లు రన్ కావాడనికి సోలార్ ఎనర్జీని వాడుకునే ఏర్పాటు చేసారు. యంత్రం పై భాగంలో అమర్చిన సోలార్ ప్లేట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తుతో బ్యాటరీ ఛార్జింగ్ చేసి.. ఆ విద్యుత్‌తో యంత్రం పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ మిషన్ సైజు చాలా చిన్నగా ఉండటం వల్ల విప్పదేసి ఎక్కడికైనా సునాయాసంగా తీసుకెళ్లవచ్చని శుభశ్రీ, ఆమెకు గైడుగా పనిచేసిన తండ్రి లలిత్ మోహన్ సాహు చెప్పారు.