గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో శనివారం రాత్రి ఓ వ్యక్తి గంజాయి మత్తులో ద్విచక్రవాహనం నడుపుతూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. గ్రామానికి చెందిన చేయుల యల్లమంద అదే గ్రామంలో కోళ్లఫాంలో పనిచేస్తుంటాడు. శనివారం మోతకడ నుంచి ద్విచక్రవాహనంపై తాడికొండ వస్తుండగా వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దిమ్మెను ఢీకొట్టి.. అలాగే కొంత దూరం ఈడ్చుకుపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని ద్విచక్రవాహనంలో కొంత గంజాయి ఉంది. యల్లమంద గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంపై తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.