ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 28, 2020, 10:55 AM IST

Updated : Mar 28, 2020, 12:25 PM IST

ETV Bharat / state

కరోనా సోకిందన్న అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

తనకు కరోనా వచ్చిందన్న అనుమానంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన వల్ల ఊరి ప్రజలకు ఈ మహమ్మారి వైరస్ సోకుతుందేమోనన్న భయంతో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

A man committed suicide amid corona virus pandemic
A man committed suicide amid corona virus pandemic

కరోనా సోకిందన్న అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

కరోనా భయం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. తనకు కరోనా వైరస్ వచ్చిందేమోనన్న అనుమానంతో గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన అక్కల వెంకటయ్య(55) హైదరాబాద్‌లో భవన నిర్మాణ మేస్త్రీగా పని చేస్తున్నాడు. రెండ్రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ముభావంగా ఉండేవాడు.

హైదరాబాద్‌తోపాటు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారి పేర్లు నమోదు చేయించుకోవాలని శుక్రవారం రాత్రి గ్రామంలో దండోరా వేశారు. ఇందులో భాగంగా వెంకటయ్య పేరు కూడా నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన వెంకటయ్య తన రెండో కుమారుడు శిలువబాబుకు ఫోన్‌ చేసి తనకు కరోనా సోకినట్లు అనుమానంగా ఉందని, తన వల్ల ఊరందరికీ వస్తుందని, గ్రామ శివారులో ఉన్నానని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. కుమారుడు అక్కడికి చేరుకునే సరికి ద్వారకాపూడి రహదారి పక్కన వేపచెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే శిలువబాబు పోలీసులకు సమాచారమిచ్చాడు. సాగర్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:కరోనా అనుమానితులను వెనక్కి పంపిన వైద్యులు

Last Updated : Mar 28, 2020, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details