Valentines Day 2023: మీ మనసులో మాటలన్నీ విన్నాక... నా మదిలోని మాట మీకు చెప్పాలనిపించింది. ప్రేమికుల రోజు వస్తోంది. గిఫ్ట్‌లు ఏం కొనాలో ఆలోచించేసి ఉంటారు. ప్రేమించేవారిని ఎలా సర్‌ప్రైజ్ చేయాలో నిర్ణయానికి వచ్చి ఉంటారు. వాట్సప్ డీపీగా ఏ ఫొటో పెట్టాలో... ఫేస్‌బుక్ పేజీలో ఏ కవిత పోస్ట్ చేయాలో... ఇన్‌స్టాగ్రాంలో ఏ చిత్రం పంచుకోవాలో.. సిద్ధంగా ఉంచుకునే ఉంటారు. ఇన్ని చేసే మీరు ప్రేమలో ప్రేమ మాత్రమే ఉంటుందని.. ఈర్ష్య, ద్వేషం, మోసం, కుట్ర, అపార్థం, అపనమ్మకం ఉండవని గుర్తు చేసుకోరా?
నింగికి నేలంటే ప్రేమ... వర్షించి పరిమళాలు అద్దుతుంది.
ప్రేమికులైతే నమ్మకాన్ని వర్షించాలి. బంధం పరిమళిస్తుంది.
నేలకు చెట్టంటే ప్రేమ..నీరిచ్చి పెంచుతుంది.
ప్రేమికులైతే నేనున్నానని భరోసానివ్వాలి. అన్యోన్యం పెరుగుతుంది.
చెట్టుకు మనిషంటే ప్రేమ... ఊపిరి పోస్తుంది.
ప్రేమికులైతే స్వేచ్ఛ గాలులు పీల్చనివ్వాలి. ప్రేమ ప్రాణం పోసుకుంటుంది.
... ఆ ప్రేమ ఎందరో జీవితాలకు ప్రాణం పోస్తుంది. ఎన్నో గమ్యాలు చేరుకొనే మార్గం చూపుతుంది. ఎన్నో లక్ష్యాలకు విజయం అందిస్తుంది.
అదే ఈర్ష్య వర్షిస్తే.. ప్రేమ బలహీనపడుతుంది. మోసం నీరుగా పోస్తే... కన్నీరై విలపిస్తుంది. అపార్థం చొరబడితే.. ఊపిరి ఆగిపోతుంది. ప్రేమ చచ్చిపోతుంది.
అమ్మాయి నచ్చిందంటున్నారు... మీరు ఆమెకు నచ్చాలిగా..!
అబ్బాయి వదిలేశాడంటున్నారు... అతనికొచ్చిన కష్టమేంటో చూసుకోవాలిగా..!
అమ్మాయి మోసం చేసిందంటున్నారు... ఆమె పరిస్థితి అర్థం చేసుకోరా!