ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోన్ పోయిందా?.. మీ సీక్రెట్స్ బయటపడతాయనే భయంగా ఉందా? - Phone Missing Fear

Fear of Losing the Phone: ప్రస్తుత రోజుల్లో చిన్నాపెద్దా అని తేడా లేకుండా ప్రతి వ్యక్తి జీవితం సెల్​ఫోన్​ చుట్టూ తిరుగుతోంది. చాలా మంది తమ వ్యక్తిగత అంశాలను అందులో భద్రపరచుకుంటుంటారు. అలాంటి ఫోన్​ చోరీకి గురైనప్పుడు కొందరు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అందులో ఉన్న తమ సమాచారం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళన చెందుతుంటారు. హైదరాబాద్​లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఓ చోటా నాయకుడికి. అసలేమైందంటే..?

Phone thefts
ఫోన్ల దొంగతనాలు

By

Published : Dec 25, 2022, 11:15 AM IST

Fear of Losing the Phone: ఆయనో చోటా నాయకుడు.. రాజకీయ పర్యటనలో అతడి సెల్‌ఫోన్‌ మాయమైంది. దాని ఖరీదు రూ.20,000. దాన్ని తెచ్చి అప్పగిస్తే రూ.50,000 బహుమతి అంటూ అనుచరులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. ఇటీవల ఎస్‌.ఆర్‌.నగర్‌ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన. ప్రజాప్రతినిధితో కలిసి వినోద వేడుకల్లో పాల్గొన్న ఫొటోలు అందులో ఉండటమే బాధితుడి ఆందోళనకు కారణమని తెలుస్తోంది.

ప్రతి ఒక్కరూ మొబైల్‌ ఫోన్‌లో వాహన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, వ్యక్తిగత వివరాలు భద్రపరచుకుంటున్నారు. అంత విలువైన ఫోన్‌ ఒక్క నిమిషం కనిపించకపోతే ఉక్కిరిబిక్కిరే. ఇక చోరీకి గురైతే చెప్పక్కరలేదు. యువకులు, రాజకీయ నాయకులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల రాచకొండ పరిధిలో ఓ నాయకుడి ఫోన్‌ మాయమైంది. దాన్ని వెతికి తీసుకురమ్మంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. ఫోన్‌ కొట్టేసిన వ్యక్తి దాన్ని రూ.3,000కు ఓ మహిళకు విక్రయించాడు. ఐఎంఈఐ ట్రాకింగ్‌లో పోలీసులు ఆ ఫోన్‌ను గుర్తించి సదరు నాయకుడికి అప్పగించారు. ఆయన గోవా వెళ్లినప్పటి ఫొటోలు అదే ఫోన్‌లో ఉండటమే ఆందోళనకు కారణమని తేలింది.

ఆవేదనకు అసలు కారణం..:గ్రేటర్‌ పరిధి మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో రోజూ సెల్‌ఫోన్లు మాయమైనట్టు 30-40 ఫిర్యాదులు అందుతుంటాయి. ఐటీ సెల్‌లో బాధితుల సెల్‌ఫోన్‌ ఐఎంఈఐ నంబరు ఆధారంగా ట్రాకింగ్‌ ఉంచుతారు. సిమ్‌కార్డు మార్చి ఫోన్‌ ఉపయోగించగానే వివరాలను పోలీసులు గుర్తిస్తారు. దాని ఆధారంగా ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగిస్తున్నారు. ఈలోగా గుబులు పడుతూ ఠాణాల చుట్టూ చక్కర్లు కొడుతూ.. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు అందులో ఉండటమే కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు.

*దేశ, విదేశాల్లో వేడుకల్లో పాల్గొనటం, ప్రేమికులతో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకొన్న ఫొటోలు, అనైతిక సంబంధాలతో గుట్టుగా తీసిన వీడియోలను అధిక శాతం మొబైల్‌ ఫోన్లలోనే భద్రపరచుకుంటున్నారు. ఫోన్లు మాయమైనప్పుడు.. ఆ గుట్టంతా బయటపడుతుందనే ఆందోళనకు గురవుతున్నారు. 4 నెలల క్రితం సైబరాబాద్‌ పోలీసులు కరడుగట్టిన దొంగను అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి 10 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 7 ఫోన్లలో అశ్లీల ఫొటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.

అమ్మడం తేలిక:కొందరు దొంగలు దారెంట ఒంటరిగా నడచుకుంటూ సెల్‌ఫోన్‌ మాట్లాడుకుంటూ వెళ్లే వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయాల్లో సిటీ బస్సులు, రైళ్లలోకి చొరబడి దొంగలు సెల్‌ఫోన్లు కొట్టేస్తున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో రూ.1000-2000లకు అమ్మేస్తున్నారు. అక్కడ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చోరీ చేసిన సెల్‌ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు మార్చి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలకు చేరవేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కొత్తఫోన్లు, ప్రముఖ బ్రాండ్లు అయితే బంగ్లాదేశ్‌, నేపాల్‌ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

స్క్రీన్‌లాక్‌ ఉత్తమ మార్గం:సెల్‌ఫోన్‌కు తప్పకుండా స్క్రీన్‌లాక్‌ చేసుకోవాలి. ఫోన్‌ను మెయిల్‌తో లింకు చేసుకొని ఉన్నట్లయితే.. ఫొటోలు, వీడియోలు క్లౌడ్‌లో భద్రపరచు కొన్నట్లయితే.. సెల్‌ పోయిన వెంటనే వాటిని తొలగించవచ్చు.

*ఫోన్‌ చోరీకు గురైతే 5-10 నిమిషాల వ్యవధిలో అంతర్జాలంలో ‘ఫైండ్‌ మై డివైస్‌’ లోకి వెళ్లి ఎక్కడ ఉందనేది గుర్తించవచ్చు. ఫోన్‌ ఆన్‌లో ఉంటే పూర్తి డేటా తొలగించవచ్చు. ఫోన్‌ దొరగ్గానే ఆఫ్‌ చేసినట్టయితే వాటిలో ఫొటోలు, వీడియోలు తీసివేయటం కష్టమవుతుంది. వ్యక్తిగత అంశాలను మెమొరీ కార్డు, ఫోన్‌లో ఉంచకపోవటం ఉత్తమమని సాంకేతిక నిపుణుడు రంజిత్‌ సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details