Smita Sabharwal Tweet Today: అర్ధరాత్రి తన ఇంట్లోకి ఓ చొరబాటుదారుడు రావటం.. అత్యంత బాధాకరమని ఐఏఎస్ అధికారిణి, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి అతని నుంచి తనను తాను కాపాడుకున్నానని తెలిపారు. మనం ఎంత సురక్షితంగా ఉన్నామని భావించినా తలుపు, తాళాలు సరిగా వేసి ఉన్నాయో లేదోనన్న విషయాన్ని స్వయంగా తనిఖీ చేయాలన్న గుణపాఠం నేర్చుకున్నట్టు వివరించారు.
అత్యవసరమైతే డయల్ 100కి కాల్ చేయాలని స్మితా సబర్వాల్ తెలిపారు. రెండు రోజుల క్రితం ఆనంద్ రెడ్డి అనే డిప్యూటీ తహసీల్దార్ అర్థరాత్రి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడగా.. తక్షణం పరిస్థితిని గమనించిన ఆమె సెక్యూరిటీ గార్డులను పిలవటంతో వారు అతనిని పోలీసులకు అప్పగించారు.ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే.. సమయస్ఫూర్తితో వ్యవహరించాలని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే:విశ్వసనీయ సమాచారం మేరకు.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే స్మితా సబర్వాల్ ట్వీట్లకు సదరు డిప్యూటీ తహసీల్దార్(48) ఒకట్రెండుసార్లు రీట్వీట్లు చేశాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో నేరుగా ఆమె ఉండే నివాస సముదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన ఓ హోటల్ యజమానిని వెంట తీసుకెళ్లాడు. తాను ఫలానా క్వార్టర్‌కు వెళ్లాలని కాపలా సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో.. అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు.