లాక్‌డౌన్ వేళ వలస కార్మికుల పాట్లు అన్నీ.. ఇన్నీ కావు. ఉపాధి కరవై దూర ప్రాంతాల్లో ఉన్న సొంతూళ్లకు చాలామంది కాలినడకనే బయలుదేరారు. పిల్లాపాపలను ఎత్తుకుని.. సామగ్రి నెత్తిన పెట్టుకుని... పయనమైన దయనీయ పరిస్థితులు... చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. మండే ఎండలు.... కాలే కడుపులతో.... వందలాది కిలోమీటర్ల మేర వారు సాగిస్తున్న పయనం... మనసున్న ప్రతిఒక్కరినీ కదిలించింది.
ఈ సమస్యను ఈటీవీ భారత్ - ఈనాడు ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి... వలస కూలీల ఇబ్బందులను వెలుగులోకి తీసుకువచ్చారు. స్పందించిన ప్రభుత్వం.. సమీక్ష నిర్వహించి వలస కూలీల సంక్షేమానికి చర్యలు చేపట్టింది. నడిచి, సైకిళ్లు, ట్రక్కులపై ఎవరూ వెళ్లకుండా అధికారులు వారిని ఆపి తాత్కాలిక శిబిరాలకు తరలించారు. జాతీయ రహదారిపై ఆయా రాష్ట్రాల వారికి అర్థమయ్యే భాషల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
శిబిరాలకు తీసుకువచ్చి భోజనం, తాగునీరు అందిస్తున్నారు. ఒడిశా వాసులను బస్సుల్లో పంపిస్తున్నారు. మిగతా రాష్ట్రాలకు శ్రామిక రైళ్ల ద్వారా వలస కార్మికులను పంపుతున్నారు. శిబిరాల్లో ఏర్పాట్లపై కూలీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.