Permission for Mercy Killing: కారుణ్య మరణానికి అనుమతి ఇవాలంటూ బాపట్ల జిల్లా బొడ్డువానిపాలెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గొట్టిపాటి సుధారాణి సీఎంకు విన్నవించేందుకు వస్తుండగా తాడేపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బొడ్డువానిపాలెంలో తమ ఇంటి వద్ద దారి లేకుండా స్థానిక వైసీపీ నాయకుడు నేరెళ్ల వెంకటేశ్వరరావు గోడ కట్టారని.. గతేడాది కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలో ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం హుటాహుటిన అధికారులను పంపి సమస్యను పరిష్కరించారు.
తాజాగా వైసీపీ నేత వెంకటేశ్వరరావు మళ్లీ గోడ నిర్మించి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సుధారాణి చెప్పారు. గుంటూరు శాసనసభ్యులు ముస్తఫా సహకారంతో వెంకటేశ్వరరావు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సుధారాణి తెలిపారు. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు.
దీంతో సీఎం అనుమతితో కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని సుధారాణి కుమార్తె హారిక చెప్పారు. అనేకమందిని కలిసి.. తమ సమస్య చెప్పినా ఎవరూ కూడా ఏం చేయలేమని అంటున్నారని వాపోయారు. సీఎం అనుమతి తీసుకునేందుకు తాడేపల్లికి పాదయాత్రగా వచ్చిన సుధారాణి కుటుంబ సభ్యులను సీఎం నివాసానికి సమీపంలో పోలీసులు అడ్డుకొని స్టేషన్కి తరలించారు.