గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆస్పత్రి పెడుతున్నామంటూ ఓ వైద్యురాలు తాడేపల్లి మండలం ఇప్పటంలో మాజీ సైనికుడి వద్ద రూ.60 లక్షలు తీసుకొని ముఖం చాటేసింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
మాజీ సైనికుడు కార్తీక్ భార్యకు వైద్యురాలు రోజారాణి ఫిజియోథెరపీ చేసింది. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో చనువుగా మెలిగిన రోజా మంగళగిరిలో ఆస్పత్రి పెడుతున్నామని.. బ్యాంకు నుంచి కోటిన్నర వస్తోందని నమ్మబలికి.. కార్తీక్ వద్ద రూ.60లక్షలు, ఆయన ఇంటి కాగితాలు తీసుకుంది. వారంలో ఇస్తానని చెప్పి నెలలు గడుస్తున్నా రోజా నుంచి సమాధానం లేకపోవడంతో ఈ ఏడాది జులైలో గట్టిగా నిలదీశారు. ఆగస్టులో తన పెళ్లి ఉందని.. అది కాగానే ఇస్తానని చెప్పడంతో కార్తీక్ కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత డబ్బులు అడిగితే మీరు ఎవరో తనకు తెలియదని వైద్యురాలు చెప్పిందని బాధితులు వాపోయారు. స్పందన కార్యక్రమంలో భాగంగా రోజారాణి, ఆమె భర్త ఎస్సై వినోద్ కుమార్‌పై బాధితులు ఫిర్యాదు చేశారు.