పిల్లలు లేరన్న బాధ ఒకవైపు తొలిచేస్తున్నా... దేవుడు కరుణించలేదులే అని సరిపెట్టుకొని బతికేసిందా వృద్ధ జంట. సమాజం మాత్రం వాళ్లను వదిలితేగా... పుల్లవిరుపు మాటలతో హింసించేది. ఆ మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయో ఏమో... జీవితం చివరి దశలోనూ పిల్లలను కనాలనే కోరిక బలపడింది. ఆ సంకల్పమే 73 ఏళ్ల మంగాయమ్మ గర్భం దాల్చేలా చేసింది. ఇద్దరు ఆడపిల్లలకు తల్లిని చేసింది.
73 ఏళ్ల బామ్మకు కవల పిల్లలు. - mangayamma
అమ్మతనం కోసం వయసును ఆమె లెక్క చేయలేదు. ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలు ఆమెను కుంగదీయ లేదు. ఆత్మవిశ్వాసం పెంచాయి. ఆ ధైర్యం చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఓ ప్రయత్నం చేద్దామని కృత్రిమ గర్భధారణ ప్రక్రియ చేపట్టారు. గిర్రున 9నెలలు తిరిగే సరికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. అంతేనా ప్రపంచంలోనే ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు తూర్పు గోదావరికి చెందిన మంగాయమ్మ.
తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన మంగాయమ్మ రాజారావు దంపతులు పిల్లలకు జన్మనివ్వాలని గుంటూరులోని అహల్యా అసుపత్రి వైద్యులను ఆశ్రయించారు. వారి ధైర్యాన్ని చూసి వైద్యులు వెనక్కి తగ్గలేదు... ఆ దంపతుల కలకు అహల్య ఆసుపత్రి వైద్యులు రూపం తీసుకొచ్చారు. కృత్రిమ ప్రక్రియ ద్వారా మంగాయమ్మ గర్భం దాల్చేలా చేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే 9నెలలు ఆమె ఉన్నారు. ఈరోజు గుంటూరులోని డాక్టర్ శనక్కాయల అరుణ, ఉమా శంకర్ ఈమెకు శస్త్ర చికిత్స చేశారు. బామ్మ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. గతంలో 70 ఏళ్లకు ప్రసవం రికార్డు ఉంది..ఇప్పుడు 73 ఏళ్ల మంగాయమ్మ పేరిట ఆ రికార్డు నమోదైంది.