గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం ఒకే రోజు 8 కొత్త కేసులు వచ్చాయి. సత్తెనపల్లి 3, తాడేపల్లి-3, గుంటూరు నగరంలో 2 కేసులు వెలుగు చూశాయి. కొత్త వాటితో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో కేసులు 602కు చేరాయి. గుంటూరు, నరసరావుపేట వంటి రెడ్‌జోన్ ఏరియాల్లో కేసులు తగ్గగా కొత్త ప్రాంతాలకు వ్యాధి విస్తరిస్తోంది. సత్తెనపల్లిలో తాజాగా వచ్చిన మూడు కేసులతో కలిపితే 5 వచ్చినట్లు అయింది.
ఇటీవల పట్టణానికి చెందిన ఒకరు హైదరాబాద్‌లో ఉండి అనారోగ్యం పాలై సత్తెనపల్లిలో మృతి చెందారు. అంత్యక్రియలు స్థానికంగా నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తయ్యాక ఆ వ్యక్తికి కరోనా అని తేలింది. అప్పటికే శవాన్ని వారి కుటుంబీకులు, బంధువులు సందర్శించారు. ప్రస్తుతం వారి కుటుంబీకులకే నలుగురికి కరోనా వ్యాప్తి చెందగా గుంటూరులో ఉండే దూరపు బంధువు ఒకరికి సోకింది. వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితంవచ్చే వరకు వే చి ఉండకుండా వెంటనే ఆసుపత్రి అధికారులు శవానికి పంచనామా చేసి అప్పగించటం వారి నిర్వాకాన్ని తెలియజేస్తోంది. యంత్రాంగం నిర్వాకం వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతోందనటానికి ఇదో నిదర్శనం.
● తాడేపల్లిలో ఇంతకు ముందు ఓ వాలంటీర్‌కు పాజిటివ్ వచ్చింది. ఆ వాలంటీర్ ద్వితీయ కాంటాక్టులను క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి నిర్ధారణ అయింది. వీరంతా మహానాడునగర్ వాసులుగా గుర్తించారు.