కాస్త వయసు పైన బడితేనే... ఆయాసంతో హమ్మా అంటాం. నడుం పనిచేయట్లేదని.. ఎప్పుడూ గొనుక్కోవడం. 75 ఏళ్ల వయస్సైతే... కృష్ణా... రామా అంటూ కుర్చుంటాం. కానీ ఈయన మాత్రం.. నీటిపై నిశ్చలంగా.. కాళ్లు చేతుల కదపకుండా ఉంటారు. నీటిపై శవాసనమేయడం ఆయన ప్రత్యేకత.
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామానికి చెందిన కోటిరెడ్డి వయస్సు 75 ఏళ్లు. ఆయన వయసు చెబితేనే... అవునా అంత వయస్సుంటుందా అనిపిస్తోంది. కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆయన వేస్తున్న ఆసనాలు అందరిదృష్టినీ ఆకర్షిస్తున్నాయి. సాగర్ కాల్వలో.. రోజుకు కొన్ని గంటలపాటు కోటిరెడ్డి... ఆసనాలు వేస్తూ అబ్బురపరుస్తున్నాడు. శాస్త్రీయంగా ఏ ఆసనం ఎందుకో తెలియదు గానీ... నీటిలో ఎలా వేయమంటే అలా ఆసనాలు వేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.