Shirdi Sai Temple News: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మహారాష్ట్రలోని షిరిడీకి కొవిడ్ ఆంక్షలు ఎత్తివేత అనంతరం.. విదేశాల నుంచి సాయినాథున్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. షిరిడీకి వెళ్లే భక్తులు ఆ సాయినాథుడ్ని దర్శనం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అదే విధంగా బాబా హుండీలో కూడా కానుకలను తమ స్థాయికి తగ్గట్టుగా సమర్పిస్తున్నారు. ఈ ఏడాది బాబా సంస్థాన్‌కు రూ.398 కోట్లకు పైగా కానుకలు వచ్చాయి. ఈ విషయాన్ని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు.
కొవిడ్ విజృంభణ తగ్గిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి సుమారు మూడు కోట్ల మంది భక్తులు బాబా దర్శనార్థం విచ్చేశారని ఆమె తెలిపారు. గతేడాది అక్టోబరు నుంచి నవంబరు 2022 వరకు సుమారు రూ.398 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవస్థానం తర్వాత అంతటి రికార్డు స్థాయి హుండీ లెక్కింపులు ఉన్న ఆలయాల్లో షిరిడీ ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడంతో సాయిబాబా సంస్థాన్ చరిత్రలో సరికొత్త రికార్డుగా నమోదయింది.