రాష్ట్రంలోని 13 వేల 340 గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం.. 948 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆగస్టు నెలలో నిధులు విడుదలైన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని తీసేసుకుంది. గతంలో 14వ ఆర్థిక సంఘం నిధులనూ ప్రభుత్వం ఇలాగే లాగేసుకుంది. దీంతో ఆగ్రహించిన సర్పంచులు.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఎట్టకేలకు.. ఆ నిధుల్ని పంచాయతీల పీడీ ఖాతాల్లో జమ చేసింది.
ఏడాదిన్నరగా గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం పనులకు సొంత డబ్బులు వెచ్చించిన సర్పంచులు.. పీడీ ఖాతాల్లో జమ చేసిన నిధులతో అప్పులు తీర్చుకోవచ్చని భావించారు. అయితే.. ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు ఆంక్షలు విధించారు. వీటితో విద్యుత్ బిల్లుల బకాయిలు, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించే గ్రీన్ అంబాసిడర్ల జీతాలు చెల్లించాలని సూచించారు. వాస్తవానికి గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు.. క్లీన్ ఏపీ కింద ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది.
ప్రభుత్వం ఆ పని చేయకుండా.. ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని చెప్పడం పట్ల.. సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేకపోతున్నామని.. సర్పంచులు వాపోతున్నారు. పాడైపోయిన రహదారులకు కనీసం మరమ్మతులు చేయించడానికైనా నిధులు వాడుకునేందుకు అనుమతించాలని కోరుతున్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాలకు నిధులు కేటాయించకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు..