ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి రైతులు దిల్లీ యాత్ర.. జంతర్‌మంతర్‌ వద్ద 3 రోజులు నిరసనలు

Amaravati Farmers March To Delhi: అమరావతిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే డిమాండ్‌తో రాజధాని ప్రాంత రైతులు దిల్లీ యాత్ర చేపట్టారు. ఇవాళ ప్రత్యేక రైలులో దిల్లీ బయల్దేరనున్నారు. రాజధాని ఉద్యమం మొదలై ఈ నెల 17 నాటికి మూడేళ్లవుతున్న సందర్భంగా.. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రైతులు ఆందోళన చేపట్టనున్నారు. జాతీయ స్థాయిలో అమరావతి మద్దతు కూడగట్టేందుకు.. వివిధ పార్టీల నేతల్ని కలవాలని నిర్ణయించారు. దిల్లీ యాత్ర ద్వారా కేంద్రప్రభుత్వానికి తమ వాణిని గట్టిగా వినిపిస్తామని ఐకాస నేతలు, రైతులు తెలిపారు.

Amaravati farmers
అమరావతి రైతులు

By

Published : Dec 15, 2022, 7:09 AM IST

Updated : Dec 15, 2022, 9:00 AM IST

Amaravati Farmers March To Delhi: జై అమరావతి నినాదాన్ని దేశ రాజధానిలో వినిపించేందుకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్‌.. 3 రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దిల్లీ యాత్రకు శ్రీకారం చుట్టారు. నెల రోజుల క్రితం జరిగిన ఐకాస సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు.. మూడు రోజుల పాటు రైతులు దిల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించడం, హైకోర్టు తీర్పుని అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో అమరావతి పోరాటాన్ని జాతీయస్థాయిలో తీసుకెళ్లేందుకు రైతులు సిద్ధమయ్యారు.

అమరావతి రైతులు దిల్లీ యాత్ర..జంతర్‌మంతర్‌ వద్ద 3 రోజులు నిరసనలు

కేంద్ర ప్రభుత్వానికి తమ గోడు వినిపించేందుకు హస్తిన బాట పట్టారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో దిల్లీ బయల్దేరివెళ్లనున్నారు. 15 వందల మందికి పైగా రైతులు యాత్రలో పాల్గొంటున్నారు. శుక్రవారం రాత్రి 9న్నర గంటలకు ఈ రైలు దిల్లీ సర్దార్ జంగ్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. 17వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రైతులు నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. 18వ తేదీన ఐకాస నేతలు, రైతులు.. బృందాలుగా విడిపోయి.. వివిధ పార్టీల అధినేతలు, ఎంపీలను కలిసి.. అమరావతి ఆవశ్యకత, జరుగుతున్న అన్యాయాన్ని వివరించనున్నారు. 19వ తేదీన రామ్‌లీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్‌ సంఘ్‌ బహిరంగసభలో రైతులు పాల్గొంటారు.

దిల్లీలో చలిని దృష్టిలో ఉంచుకుని.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఐకాస నేతలు రైతులకు సూచించారు. ఆధార్‌ కార్డులు తప్పనిసరిగా తెచ్చుకోవాలని చెప్పారు. ఎవరెవరికి ఏ భోగీలో సీటు కేటాయించారో.. ఆయా గ్రామాల దీక్షాశిబిరాల నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి గ్రామం నుంచి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను వాలంటీర్లుగా ఎంపికచేశారు. ఆ గ్రామం నుంచి వెళ్లేవారిని సమన్వయం చేసుకునే బాధ్యత వారికి అప్పగించారు.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా.. అక్కడ వివిధ పార్టీల ఎంపీలను కలవడం సులువవుతుందని రైతులు భావిస్తున్నారు. అమరావతి ఉద్యమానికి జాతీయపార్టీల మద్దతు కోరనున్నట్లు రైతులు తెలిపారు. రాజధాని అంశంలో కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని దిల్లీలో కోరతామని చెబుతున్నారు.. 3 రోజుల దిల్లీ పర్యటన తర్వాత.. అక్కడి నుంచి బయల్దేరి 21వ తేదీ ఉదయం విజయవాడ చేరుకునేలా ఐకాస నేతలు, రైతులు ప్రణాళిక చేశారు. ఈ యాత్ర ద్వారా అమరావతి ఉద్యమానికి మరింత తోడ్పాటు లభిస్తుందని విశ్వసిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 15, 2022, 9:00 AM IST

ABOUT THE AUTHOR

...view details