108 ambulances Ambulances in AP: రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కారణాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్రులకు చేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. అత్యఅవసరమైన 108 అంబులెన్సులను కొనుగోలుచేయడంలో నిన్నటివరకు తాత్సారం చేసింది. అతికష్టంపై వాటిని సమకూర్చుకున్నా.. సిద్ధంగా ఉన్న వాటిని అందుబాటులోకి తెచ్చే విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది జనవరి 25న పిలిచిన టెండరు ప్రకారం ఎల్1గా వచ్చిన సంస్థ దశల వారీగా 146 వాహనాలను పంపగా.. వాటిని మంగళగిరిలో వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం సమీపంలోని ఓ ప్రముఖ ఆసుపత్రి ఆవరణలో ఉంచారు. ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా వాహనాలను జిల్లాలకు పంపించాలని ఏర్పాట్లు చేశారు. సీఎం చేతుల మీదుగా వాటిని ప్రారంభించాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుని తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు చేర్చే 108 వాహనాల విషయంలో ప్రభుత్వం అలసత్వంప్రదర్శిస్తోంది. కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి జిల్లాలకు పంపే వరకు నిర్లక్ష్యం వహిస్తుంది. మే మొదటి వారంలోనే అవి అక్కడికి చేరుకోగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, పరికరాలు అమర్చడంలో మరింత జాప్యమైంది. ప్రధానంగా అంబులెన్సుల్లోని పరికరాలను వాహనంతోపాటు కొనుగోలు చేయాలని ఒకసారి, విడిగా కొనాలని మరోసారి నిర్ణయించడంతో విపరీతమైన జాప్యం జరిగింది. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ద్వారా ఈ వాహనాలను జిల్లాలకు పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాల నుంచి అంబులెన్స్‌ల డ్రైవర్లను కూడా రప్పించారు. ముఖ్యమంత్రి జగన్ ద్వారా వీటిని ప్రారంభింపచేయాలన్న ఉద్దేశంతో చివరి నిమిషంలో తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.