Chlorine Gas Leakage in Jangaon: జనగామలో నీటి శుద్ధి కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ నుంచి క్లోరిన్ వాయువు లీకైంది. ఈ గ్యాస్ పీల్చిన 100 మంది వరకు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జనగామలోని సబ్ జైలు పక్కన ఉన్న మున్సిపల్ నీటి ట్యాంకు వద్ద కొన్నేళ్లుగా క్లోరిన్ గ్యాస్ సిలిండర్ నిరుపయోగంగా ఉంది. ఈ సిలెండర్ నుంచి గ్యాస్ లీకైంది. గురువారం సాయంత్రం నుంచి గ్యాస్ లీక్ ప్రారంభమై రాత్రి 7 తర్వాత తీవ్రమైంది. సమాచారం అందుకున్న నీటి సరఫరా సిబ్బంది.. సూపర్‌వైజర్‌కు విషయం తెలిపారు.
సూపర్‌వైజర్ సలహా మేరకు పక్కనే ఉన్న నీటి సంపులో సిలిండర్‌ను వేయగా.. క్లోరిన్ వాయువు లీకేజీ స్వల్పంగా ఆగిపోయింది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. కొద్దికొద్దిగా లీక్ అవుతున్న క్లోరిన్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు సంపులోకి నీటి ప్రవాహాన్ని పెంచారు. ఫలితంగా సమస్య తీవ్రమైంది.
ఆ నీటిలో క్లోరిన్‌తో పాటు, పొటాష్ ఆలం మిశ్రమం కలిసి ఉండడంతో నీరంతా వెలుపలకు పొంగింది. ఫలితంగా నీరు ప్రవహించినంత దూరం ఘాటు వాసన వ్యాపించింది. స్థానిక ఈద్గా వెనుక కాలనీలు, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ రోడ్డు పై వెళ్లేవారు, గీతానగర్, స్థానికులపై దాని ప్రభావం పడింది. లీకైన గ్యాస్ ఎక్కడి నుంచి నుంచి వస్తుందో తెలియక స్థానికులు ఆందోళనకు లోనయ్యారు. ఒకదశలో పట్టణంలోని జనరల్ ఆసుపత్రి నుంచి గ్యాస్ లీకైందనే ప్రచారం జరిగింది. వెంటనే ఆసుపత్రి పర్యవేక్షకులు సిబ్బందిని అప్రమత్తం చేసి, పరిశీలించారు. అక్కడ ఏం లేదని నిర్దారించారు. రాత్రి పది గంటల తర్వాత లీకేజీ ఆగిపోయింది.