ప్రశాంతంగా ఉండే ఆ పల్లెల్లో ఇప్పుడు ఉద్యమ రణన్నినాదాలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం తప్ప మరోటి తెలియని రైతులు... వంద రోజులుగా రోజులుగా ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్నారు. బతుకు కోసం, భవిష్యత్తు కోసం వారు చేస్తున్న ఆందోళనలు వందో రోజుకు చేరాయి.
రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో సుమారు 34, 291 ఎకరాల్ని రైతులు భూ సమీకరణలో ఇచ్చారు. సుమారు 2 వేల మంది రైతులు భూములు ఇచ్చినవారిలో ఉన్నారు. అందులో ఎక్కువ మంది సన్న చిన్నకారు రైతులే. అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న పేదలూ ఇందులో ఉన్నారు. ప్రభుత్వం మారినా రాజధాని ఇక్కడే ఉంటుందన్న భరోసాతో ఉన్న రైతులకు 2019 డిసెంబరు 17న శాసనసభలో.. సీఎం జగన్ బయటపెట్టిన 3 రాజధానుల ఆలోచన శరాఘాతంలా తగిలింది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో మొదలై క్రమంగా రాజధానిలోని అన్ని గ్రామాలకూ ఉద్యమం విస్తరించింది. రాజధాని ఉద్యమానికి రైతులే సారథ్యం వహిస్తున్నారు. వారి పోరాటానికి అధికార వైకాపా తప్ప, అన్ని పార్టీలూ సంఘీభావం ప్రకటించాయి.
రాజధాని నిర్మిస్తామని భూములు తీసుకుని.. ఇప్పుడు మరో చోటుకి ఎలా తరలిస్తారని రైతులు నిలదీస్తున్నారు. అటు వ్యవసాయమూ లేక, ఇటు రాజధాని లేకపోతే తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలన్న ఆందోళనతో ఉద్యమిస్తున్నారు. ఎప్పుడూ గడపదాటని మహిళలు పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రభుత్వ హెచ్చరికలు... పోలీసుల బెదిరింపులు.. కేసులు.. దిగ్బంధాలు, వారి ఉద్యమ స్ఫూర్తిని దెబ్బ తీయలేకపోయాయి. క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది.. పండుగల్లోను పోరాటం ఆగలేదు. ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక మహమ్మారి కరోనాకు సైతం వారు బెదరలేదు. జాగ్రత్తలు తీసుకుంటూనే.. సామాజిక దూరం పాటిస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.