నేడే ఏపీ సర్కారు తాత్కాలిక బడ్జెట్ - ఏపీ సర్కారు తాత్కాలిక బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు ఉదయం మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
గత ఏడాది కన్నా ఈసారి రెవెన్యూ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. సవరణ బడ్జెట్ను కూడా ఎక్కువగా చూపించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెల చివరిలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నందున వివిధ వర్గాలకు భారీ నజరానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. యువత, రైతు, మహిళలకు భారీగా కేటాయింపులు చేయనున్నారు. ప్రధానంగా రైతుకు ఏటా "అన్నదాత సుఖీభవ సాయం" పేరిట ఎకరాకు 10 వేల రూపాయల వరకు ఇవ్వాలనే ఆలోచనను బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశాలు వున్నాయి. ఇదే సమయంలో ఓటర్లను ఆకర్షించే పథకాలను కూడా చూపనున్నట్లు తెలుస్తుంది.
ఐదేళ్ల తర్వాత రెట్టింపు బడ్డెట్...
గత ఏడాది 1.94 లక్షల కోట్లు రూపాయలతో రాష్ట్ర బడ్డెట్ను ప్రతిపాదించగా... ఈసారి మరో పాతిక నుంచి 30 వేల కోట్లను అదనంగా ప్రతిపాదించే అవకాశాలు వున్నాయి. ఈ మొత్తంలో సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో నీటిపారుదల రంగానికి, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమ, వ్యవసాయం, యువజన సంక్షేమం వంటి వాటికి ఎక్కువ నిధులు కేటాయింపులో ఉంటాయని తెలుస్తుంది. రాష్ట్ర పునర్ విభజన తర్వాత 2014 -15 సంవత్సరంలో 1 .11 లక్షల కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదించగా...సరిగ్గా 5 ఏళ్ళ తరువాత ఇది రెట్టింపు కానుంది.
ఎన్నికల ముందు సమర్పిస్తున్న బడ్జెట్ కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పటంతో పాటు రాష్ట్ర వనరులు పెంచుకున్న తీరును వివరించనున్నారు.
ప్రతి సంవత్సరం రాష్ట్ర వార్షిక బడ్జెట్తో పాటు వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రవేశ పెడుతూ వస్తోంది. ఈ సారి కేవలం 4 నెలలకు అనుమతి కోరే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే కాబట్టి, వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం లేదు. జలవనరుల శాఖకు గత ఆర్థిక సంవత్సరం లో 16వేల 978 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశ పెట్టగా... ఈ సారి 20 వేల కోట్ల రూపాయలకు పైగా సవరించారు. 45 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలు రాగా దాదాపు 28 వేల కోట్ల రూపాయల వరకు కేటాయింపులు ఉంటుందని తెలుస్తుంది. జై హో బీసీ సభలో వివిధ కార్పొరేషన్ల ఏర్పాటుకు సీఎం ప్రకటించటంతో వాటికీ కొత్తగా నిధులు కేటాయింపు చేయనున్నట్లు సమాచారం.
ఇంత భారీ బడ్జెట్ లో ఆదాయ మార్గాలు ఎలా చూపుతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.