Struggle For Hospital Construction:ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన మురళీకృష్ణ.. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొంత కాలం క్రితం పాము కాటుకు గురై.. సమయానికి చికిత్స అందక కళ్లముందే తన సోదరుడిని పోగొట్టుకున్నాడు. తమ ఊర్లో అన్ని వసతులతో కూడిన ఆస్పత్రి (hospital) లేకపోవడమే తన సోదరుడి మరణానికి కారణమని భావించిన రామకృష్ణ.. మరే కుటుంబానికి అలాంటి అన్యాయం జరగకూడదని.. ఆస్పత్రి నిర్మాణం కోసం పోరాడుతున్నాడు.
బొర్రంపాలానికి 2011లో రూ.79 లక్షలతో 10 పడకలతో కూడిన ఆస్పత్రి మంజూరు కాగా.. స్థల సేకరణలో జరిగిన జాప్యం కారణంగా నిర్మాణం అటకెక్కింది. దీంతో అంచనా వ్యయం పెరిగిపోయింది. 2016లో మరోసారి ఈ ఆస్పత్రి నిర్మాణానికి కోటి 49 లక్షల రూపాయలు మంజూరు కాగా.. మళ్లీ స్థల సేకరణ దశలోనే ఆగిపోయింది. ఎట్టకేలకు గతేడాది స్థలసేకరణ జరిగినా.. నిర్మాణ పనులకు మాత్రం నోచుకోలేదు. దీంతో కనీసం అక్కడ శంకుస్థాపన కూడా జరగలేదు.