Yadadri Temple was selected as a green shrine: తెలంగాణ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్ర పురస్కారానికి.. దిల్లీలోని భారతీయ హరిత భవనాల మండలి ఎంపికచేసింది. 2022-25 సంవత్సరానికిగాను ఆలయాన్ని ప్రకటించి యాదాద్రి దేవాలయ ప్రాధికార సంస్థ (వైటీడీఏ) వీసీ కిషన్‌రావుకు హైదరాబాద్‌లో అందించారు. 13వ శతాబ్ధానికి చెందిన ఆలయం లోపలి శిలలను సంరక్షించడం, ప్రధానాలయంలోని మూలవర్యులను ముట్టుకోకుండా.. స్వయం భూ విగ్రహాలను తాకకుండా పునర్నిర్మాణంలో ఆలయ ప్రాశస్త్యం కాపాడటాన్ని ప్రశంసించింది.
సుందరీణకరణ పనులు చేపట్టడంతో పాటు ప్రత్యేక సూర్యవాహిక ద్వారా ప్రధాన ఆలయంలోకి సహజ కాంతి ప్రసరించేలా నిర్మాణం చేయడాన్ని భారతీయ హరిత భవనాల మండలి కొనియాడింది. రద్దీగా ఉన్న సమయంలో స్వచ్ఛమైన గాలి నలుదిక్కులు ప్రసరించేలా వెంటిలేటర్లు, కిటికీలు ఏర్పాటు వంటిని పరిశీలించి అవార్డు ప్రకటించినట్లు భారతీయ హరిత భవనాల మండలి వెల్లడించింది. ఆ పురస్కారం రావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.