ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

POLAVARAM: పోలవరానికి మరో సవాల్‌.. వరదొచ్చేలోగా పూర్తయ్యేనా..?

వర్షాకాలం సమీపిస్తోన్న వేళ పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు పూర్తి చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. ప్రధాన డ్యామ్ నిర్మాణం కోసం చేపడుతున్న దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం గడువులోగా పూర్తవుతుందో లేదోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2020లో వచ్చిన భారీ వరదల కారణంగా 300 మీటర్ల మేర జెట్ గ్రౌటింగ్ పనులు దెబ్బ తిన్నాయి. వచ్చే వరదలలోపు ఆ పనులు ఎంత మేర పూర్తి చేయగలరన్న దానిపై సందేహాలు రేగుతున్నాయి.

POLAVARAM: పోలవరానికి మరో సవాల్‌.. వరదొచ్చేలోగా పూర్తయ్యేనా..?
POLAVARAM: పోలవరానికి మరో సవాల్‌.. వరదొచ్చేలోగా పూర్తయ్యేనా..?

By

Published : May 31, 2022, 5:41 AM IST

వర్షాలు మొదలై.. జులైలో వరదలొచ్చేలోగా పోలవరంలో కీలక నిర్మాణాలను పూర్తి చేయడం ఇప్పుడు అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. దిగువ కాఫర్‌ డ్యాంలో ఊట నియంత్రణకు గోదావరి గర్భంలో గతంలో నిర్మించిన జెట్‌ గ్రౌటింగ్‌ రెండేళ్ల కిందట వరదలకు 300 మీటర్ల మేర ధ్వంసమైంది. దాన్ని సరిదిద్దే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించుకుంటూ, డయాఫ్రం వాల్‌, దానిపై 30 మీటర్ల ఎత్తున కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేయాలి. వీటన్నింటికీ ఎంతో గడువు లేకపోవడం అధికారులను ఆందోళన పెడుతోంది. ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతానికి ఎగువన, దిగువన కాఫర్‌ డ్యాంలు నిర్మించాలి. వీటితో వరద నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ప్రధాన డ్యాం కడతారు. ఇప్పటికే ఎగువ కాఫర్‌ డ్యాం పూర్తయింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఇసుక కోత, డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం వంటి సమస్యలతో పనులు ముందుకు సాగడం లేదు. ఈ సవాళ్ల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గోదావరికి వరదలు వచ్చేలోగా దిగువ కాఫర్‌ డ్యాం కట్టాలి. లేకుంటే వరద దిగువ నుంచి ఎగువకు వచ్చి ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని మళ్లీ ముంచెత్తే ప్రమాదం ఉంది. అయితే క్షేత్ర స్థాయి ఇబ్బందులతో దిగువ కాఫర్‌ డ్యాం ఎప్పటికి పూర్తవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

నెలన్నరే గడువు!

జలాశయంలో ఎగువన ఉన్న నీరు దిగువకు ఇసుక పొరల ద్వారా ఊట రూపంలో రాకుండా అడ్డుకునేందుకు కటాఫ్‌ మాదిరిగా నిర్మించిందే డయాఫ్రం వాల్‌. దిగువ కాఫర్‌ డ్యాం ఎడమ నుంచి కుడి వైపునకు 1,637 మీటర్లు నిర్మించాల్సి ఉంది. ఇంత పొడవున ఊట నీటి నియంత్రణకు నదీ గర్భంలో పునాది తరహాలో జెట్‌ గ్రౌటింగ్‌ నిర్మాణం చేపట్టారు. భారీ వరదలకు దాదాపు 300 మీటర్ల మేర గ్రౌటింగ్‌ ధ్వంసమై కోతపడింది. ఆ ప్రాంతంలోని భూ భౌతిక పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చి జెట్‌ గ్రౌటింగ్‌ ధ్వంసమైనంత మేర డయాఫ్రం వాల్‌ కట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం జియో బ్యాగ్‌లు ఏర్పాటు చేసి పటిష్ఠపరుస్తున్నారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి వీలుగా అక్కడ కొంతమేర గ్రౌటింగ్‌ చేస్తున్నారు. కోసుకుపోయిన ప్రాంతంలో 10 మీటర్ల దిగువ నుంచీ అంతా సరి చేసుకుంటూ రావడంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కిందటి ఆదివారం పోలవరంలో జరిగిన నిపుణుల సమావేశంలో దీనిపై చర్చించారు. తర్వాత రెండు రోజులకు వీడియో సమావేశం నిర్వహించారు. దిగువ కాఫర్‌ డ్యాంలో కోతపడ్డ ప్రాంతంలో ఎలా ముందుకెళ్లాలో డిజైన్లపరంగా అనుమతులు ఇచ్చేశామని, నిర్మాణంలో క్షేత్ర స్థాయి ఇబ్బందులను స్థానికంగానే పరిష్కరించుకోవాలని దిల్లీ నుంచి నిపుణులు తేల్చిచెప్పారు. దీంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం నెల, నెలన్నరలోగా అక్కడ 300 మీటర్ల పొడవున.. 10 మీటర్ల లోతు నుంచి పరిస్థితులు చక్కదిద్దాలి. డయాఫ్రం వాల్‌, ఆపైన 30 మీటర్ల ఎత్తు వరకు లేయర్లతో కాఫర్‌ డ్యాం నిర్మించాలి. ఇందులో డయాఫ్రం వాల్‌ నిర్మాణానికే నెలన్నర పడుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా అక్కడ మళ్లీ జెట్‌ గ్రౌటింగ్‌ చేపడదామా అన్న చర్చ జరుగుతోంది.

ఇదీ చూడండి..

POLAVARAM: డయాఫ్రమ్ వాల్‌ విషయంలో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సందిగ్ధత

ABOUT THE AUTHOR

...view details